నితీశ్​ హడావుడి ఎన్నికల కోసమేనట!

నితీశ్​ హడావుడి ఎన్నికల కోసమేనట!

దేశానికి ఇండిపెండెన్స్​ వచ్చాక జమీందారీ వ్యవస్థను రద్దు చేసిన మొదటి రాష్ట్రం బీహార్​. అక్కడ దాదాపు 90 శాతం జనాభా పల్లెల్లోనే ఉంటుంది. వాళ్లంతా వ్యవసాయం చేసుకునే బతుకుతారు. కానీ, మెజారిటీ రైతులకు సెంటు సొంత భూమి లేదు. పేదలకు ఇంటి జాగాలు లేవు. ఆ లోటును తీర్చడానికి సీఎం నితీశ్​కుమార్​ రెడీ అయ్యారు. ఎప్పటినుంచో అమలుకు నోచుకోని భూ సంస్కరణలను పట్టాలెక్కిస్తానని అంటున్నారు. అయితే.. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల గిమ్మిక్కేననే విమర్శలొస్తున్నాయి.

బీహార్ అంటే సౌత్​ ఇండియాలో చాలా చిన్న చూపు. అక్కడి మనుషులపైన, పాలిటిక్స్​పైన అంతగా గౌరవం ఉండదు. దానికి రెండు కారణాలున్నాయి. ఉన్న ఊరిలో బతకలేక పొట్టచేతబట్టుకుని వలస వచ్చేసేవాళ్లలో బీహారీలు ఎక్కువగా ఉంటారు. ఇక, రెండో కారణం బీహార్​లో లాలూ హయాం నుంచీ సాగుతున్న పొలిటికల్​ గేమ్​ ప్లాన్లు. కానీ, దేశంలోనే ల్యాండ్​ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచించిన మొదటి రాష్ట్రం బీహారే. స్వతంత్రం వచ్చాక  జమీందారీ వ్యవస్థను రద్దు చేసేసింది. అయితే, అనఫీషియల్​గా ఊరి పెత్తందారీతనం కొనసాగుతూనే ఉంది. ఇండిపెండెన్స్​ వచ్చిన తొలి రోజుల నుంచి 1990 వరకు మధ్యలో మూడు నాలుగేళ్లు మినహా  కాంగ్రెస్​ పార్టీయే అధికారంలో ఉంది. 1962లో ల్యాండ్​ సీలింగ్​ యాక్ట్​ పాసైనా అందులోని లోపాలను అడ్డం పెట్టుకొని కౌలుదార్లను ఖాళీ చేయించారు.  కాంగ్రెస్​ పార్టీలోని భూస్వాములు సీలింగ్​ ప్రకారం ఉండాల్సిన భూమికన్నా ఎక్కువగా ఉన్న భూముల్ని వదులుకోలేదు. బినామీల పేరుమీదకు మార్చారు. తమకు అనుకూలంగా వ్యవసాయ సంస్కరణలు (అగ్రేరియన్​ రిఫార్మ్స్​) తెచ్చుకున్నారు.

దీంతో రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవటానికి ‘బీహార్​ టెనెన్సీ యాక్ట్​–1885’ని 1970లో సవరించారు. దీనికితోడు బీహార్​ ప్రివిలేజ్డ్​ పర్సన్స్​ హోమ్​స్టెడ్​ టెనెన్సీ యాక్ట్​, బీహార్​ మనీలెండర్స్ యాక్ట్​ కూడా వచ్చాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. భూమి, నీరు తదితర రిసోర్స్​లపై పేదలకు హక్కులు దక్కలేదు. వాటిని పెద్ద కులాలే దక్కించుకుంటున్నాయి.

లాబీయింగ్​తో వెనకడుగు

బంద్యోపాధ్యాయ్​​ కమిషన్​ సూచనలను, సలహాలను పెద్ద కులస్తులు, బీసీలతో కూడిన పవర్​ఫుల్​ లాబీ గట్టిగా వ్యతిరేకించింది. కమిషన్​ రికమండేషన్లను అమలుచేస్తే తాము అనుభవిస్తున్న భూములపై లీగల్​ హక్కులు కోల్పోతామని భయపడ్డారు. కౌలు, చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వాల్సి వస్తుందని కుట్ర పన్నారు. నితీశ్​ సొంత పార్టీ జేడీయూలో కూడా కొందరు ఈ రిపోర్ట్​ అమలుకు ఒప్పుకోలేదు. దీంతో 2009 నుంచి అమలు చేయాల్సిన ఎన్నికల హామీ (ల్యాండ్​ రిఫార్మ్స్​) నుంచి వెనకడుగు వేశారు.

ఇదిలా ఉంటే, అక్టోబరులో బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో రాష్ట్రం​లో సొంతిల్లు, సాగు భూమి లేనోళ్లని గుర్తించాలని​ సీఎం నితీశ్​కుమార్​ ఆదేశించారు. ఇలాంటి ఆర్డర్స్​ ఇప్పటికే చాలా మంది సీఎంలు చాలాసార్లు ఇచ్చారు. భూమిలేని నిరుపేదలకు రూ.60 వేలు ఆర్థిక సాయం చేస్తామని నితీశ్​ గతంలోనూ చెప్పారు. ‘చీఫ్​ మినిస్టర్​ గ్రామ్​ ఆవాస్​ యోజన’లో భాగంగా  అమలు చేస్తామన్నారు. కానీ.. ఆ పథకం అనుకున్నంతగా సక్సెస్​ కాలేదు. ఈ అనుభవాలవల్ల ముఖ్యమంత్రి ఇచ్చిన లేటెస్ట్​ ఆర్డర్స్​పై జనానికి పెద్దగా ఆశల్లేవు.

కొత్త చట్టం అవసరం

నితీశ్​​ తొలిసారి 2000 సంవత్సరం మార్చిలో సీఎం అయ్యారు. మధ్యలో పది నెలలు (2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు) మినహా ఇప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన టర్మ్​ మొత్తం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం భూ సంస్కరణలు. ఆయన​ దేవవ్రత బంద్యోపాధ్యాయ్​ చైర్మన్​గా ఏర్పాటు చేసిన ల్యాండ్​ రిఫార్మ్స్​ కమిషన్​ తన రిపోర్ట్​ని 2008లో ఇచ్చింది. గతంలో పశ్చిమ బెంగాల్​లో లెఫ్ట్​ ఫ్రంట్​ అమలు చేసిన భూ సంస్కరణలను సూచించిందీ బంద్యోపాధ్యాయే! సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాల కోసం కొత్త చట్టాన్ని రూపొందించాలని; ల్యాండ్​ సీలింగ్​ యాక్ట్​ని, ల్యాండ్​ రికార్డ్​ల డిజిటైజేషన్​ని సమర్థంగా అమలు చేయాలని బంద్యోపాధ్యాయ్​ కమిషన్​ రికమెండ్​ చేసింది. ల్యాండ్​ సీలింగ్​ కేటగిరీల్లో మార్పులు చేశారు. సర్​ప్లస్​గా ఉన్న భూమిని 16.68 లక్షల మంది వ్యవసాయ కూలీలకు, 5.48 లక్షల మంది గూడు లేనోళ్లకు పంపిణీ చేయాలని సూచించింది. చిన్న రైతులకు సాగు భూమిపై వారసత్వ హక్కు ఇచ్చే బటాయిదారి చట్టం అమలుకు కొన్ని సిఫారసులు చేసింది.