బెల్లంపల్లిలో నిత్య జనగణమన గీతాలాపన ప్రారంభం

బెల్లంపల్లిలో నిత్య జనగణమన గీతాలాపన ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో  బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిత్య జనగణమన జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ గెస్ట్​గా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో దేశ భక్తి, ఐకమత్యాన్ని పెంపొందించేందుకు నిత్య జనగణమన జాతీయ గీతాలపన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీశ్ మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మైకుల ద్వారా పట్టణంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద  జాతీయ గీతం వస్తుందని, ఆ సమయంలో ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే నిలబడి జెండా వందనం చేసి, దేశ సమైక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్​స్పెక్టర్ బన్సీలాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచందర్,  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ లీడర్లు మునిమంద రమేశ్, దావ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న 100 మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన
 
ఈ సందర్భంగా 100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు తీసిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. కాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్, బజార్ వరకు ర్యాలీ కొనసాగింది. అంతకుముందు పట్టణంలోని ప్రెస్‌క్లబ్​లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే వినోద్​ పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు రాంశెట్టి వల్లభాయ్, అధ్యక్షుడు పులియాల రాజుతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలను కొనియాడారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.