నిజామాబాద్, వెలుగు : నగర పాలక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నిజామాబాద్, బోధన్ టౌన్లో శాంతిభద్రతల పరిరక్షణకు స్పెషల్ అరెంజ్మెంట్స్ చేస్తామన్నారు. అన్ని పోలింగ్ సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తామన్నారు. మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణికుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం అధికారులతో మీటింగ్ నిర్వహించి కలెక్టర్మాట్లాడారు. నోడల్ ఆఫీసర్లు సమర్థవంతంగా డ్యూటీలు చేయాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా చూడాలన్నారు.
టౌన్స్‌లో కోడ్ అమల్లోకి వచ్చినందున పొలిటికల్ పార్టీల బ్యానర్లు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫొటోలు తొలగించాలని సూచించారు. నామినేషన్ సెంటర్స్‌లోని అన్ని రూమ్‌లకు సీసీ కెమెరాలు బిగించాలన్నారు. సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉండొద్దు
బోధన్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉండొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్ తదితర అధికారులతో డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని, రీ-పోలింగ్‌కు అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విఠల్, అధికారులు ఉన్నారు.
అమ్దాపూర్ కస్తూర్బా గాంధీ స్కూల్ తనిఖీ
మండలంలోని అమ్దాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేయడంతోపాటు తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. బయటి వ్యక్తులను లోనికి రానివ్వొద్దని, తల్లిదండ్రులు వస్తే అనుమతించాలన్నారు. ఇటీవల బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంగీత నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదానికి గురై మృతి చెందిందని గుర్తు చేశారు.
8వ తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధించిన అనంతరం చాక్లెట్లు పంచారు. పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలని, విద్యుత్ వైరింగ్‌ను సరి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్‌ను కేటాయిస్తామని తెలిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, ఎంఈవో నాగయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు ఉన్నారు.
