రోడ్డు ప్రమాదాలకు చెక్..నివారణకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం యాక్షన్ ప్లాన్

రోడ్డు ప్రమాదాలకు చెక్..నివారణకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం యాక్షన్ ప్లాన్
  • జిల్లాలో 61 బ్లాక్​స్పాట్స్ గుర్తింపు 
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 302 ప్రమాదాలు 
  • 128 మంది మృతి, 288 మందికి గాయాలు 

నిజామాబాద్, వెలుగు :  రోడ్డు ప్రమాదాలకు చెక్​ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్​ స్పాట్​గా నమోదు చేసి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించారు.  ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రమాదాల కంట్రోలింగ్​కు పౌరుల బాధ్యతను వేరుగా అధ్యయనం చేసి ప్లాన్ సిద్ధం చేశారు.  రోడ్డు భద్రతా కమిటీకి కలెక్టర్​ చైర్మన్​గా వ్యవహరించనుండగా, ఇక నుంచి ప్రతి నెలా సమీక్షలు నిర్వహించనున్నారు. 

సీపీతో పాటు హైవే అథారిటీ ఆఫీసర్లు, ఆర్అండ్​బీ, ట్రాన్స్​పోర్ట్, ఎన్​పీడీసీఎల్, మెడికల్ అండ్ హెల్త్, ఫారెస్ట్​, అగ్రికల్చర్, మున్సిపల్ అధికారులు కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. ప్రమాదాల నివారణకు  ఆయా శాఖల పరిధిలో విధులు నిర్వహించనున్నారు. 

బ్లాక్ స్పాట్స్​పై స్పెషల్​ ఫోకస్..

జిల్లా మీదుగా 44, 63 నంబర్​ నేషనల్ హైవేలతో పాటు పలు ప్రాంతాలను లింక్ చేసే రాష్ట్ర రోడ్లు ఉన్నాయి.  గత జనవరి నుంచి జూన్ వరకు జిల్లాలో 302 యాక్సిడెంట్స్ జరుగగా, 128 మంది ప్రాణాలు కోల్పోయారు. 288 మందికి గాయాలు కాగా, ఇందులో వందకు మించి బాధితులు కోలుకోలేక ఇప్పటికీ హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు.  ఇంటి పెద్ద దిక్కును పోగొట్టుకున్న కుటుంబీకుల పరిస్థితి అధ్వానంగా ఉంది. హైవేపై 80 శాతం ప్రమాదాలు జరుగగా, పట్టణ ప్రాంతాలతోపాటు ఇతర ప్రదేశాల్లోనూ రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

  మున్ముందు వీటి సంఖ్య పెరగకుండా నియంత్రించేందుకు అధికారులు పర్యవేక్షించి మొత్తం 61 ప్రాంతాలను బ్లాక్​ స్పాట్స్​గా గుర్తించారు. ఇరుకు బ్రిడ్జిలు, ప్రమాదకరంగా మూల మలుపులు, సిగ్నల్​ వ్యవస్థ సరిగా లేకపోవడం కారణాలను గుర్తించారు. కలెక్టర్​ అధ్యక్షతన ఈనెల 2న జరిగిన మీటింగ్​లో బ్రిడ్జీలను విస్తరించడానికి ఫండ్స్ ఉన్నా ఫారెస్ట్​ శాఖతో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. హైవేలపై వాహనాల స్పీడ్ తగ్గించడానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. 

బ్లాక్​ స్పాట్స్​ వద్ద ట్రాఫిక్​ పోలీస్​ల సంఖ్య పెంచనున్నారు.  స్పీడ్​గన్స్​ ఏర్పాటు చేసి ఫెనాల్టీలు విధించనున్నారు. నగరంలో కొత్తగా ఆరు చోట్ల ట్రాఫిక్​ సిగ్నల్స్​ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు నగర పాలక సంస్థ నిధులతో చౌరస్తాల వద్ద లైన్ క్రాసింగ్ పెయింటింగ్ వేయించనున్నారు.  ప్రమాదాల నియంత్రణలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచితేనే ఫలితం ఉంటుందని సేఫ్టీ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా మద్యం మత్తులో వాహనాలు నడుపకుండా డ్రంక్ అండ్​ డ్రైవ్​ టెస్ట్​లను మరింత పెంచనున్నారు. 

ప్రస్తుతం యావరేజ్​గా ప్రతి రోజు డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడిన పది మందికి జైలు శిక్ష పడుతోంది. ఈ టెస్ట్​లను రెట్టింపు చేయాలని అధికారులు నిర్ణయించారు. హెల్మెట్స్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ఓవర్​ స్పీడ్, రాంగ్​ రూట్​లో వాహనాలు తోలడం వంటి వాటిపై చెకింగ్ ముమ్మరం చేయనున్నారు. మైనర్ల డ్రైవింగ్​పై సీపీ సాయిచైతన్య చర్యలు తీసుకోగా, కొంతమేర ఫలితం కన్పిస్తోంది.

బ్లాక్​ స్పాట్స్​ వద్ద జాగ్రత్తలు

మూడేండ్లలో వరుస యాక్సిడెంట్లతో ఐదుగురు కంటే ఎక్కువ మంది  మృతి చెందిన ఏరియాలను బ్లాక్​ స్పాట్స్​గా గుర్తించాం. రాత్రి వేళ కనబడేలా బ్లింకింగ్ లైట్స్, స్టడ్స్, రంబుల్​ స్ట్రిప్స్, ఎల్లో స్ట్రిప్ప్ ఏర్పాటు చేశాం. వాహనాల వేగాన్ని క్యాచ్ చేయడానికి స్పీడ్​ గన్స్​ పెట్టాం.  నగరంలో కొత్తగా ఐదు చౌరస్తాలలో సిగ్నల్స్​ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడున్న ఆరు సిగ్నల్స్​ను అడ్వాన్స్​ సీసీ కెమెరాలతో ఆధునీకరిస్తాం. దేవీ రోడ్డును వన్​వే చేయబోతున్నాం. ఆర్సాపల్లి రైల్వే బ్రిడ్జి పూర్తైతే సిటీలోకి ఎంటరయ్యే ట్రాఫిక్​ మరింత కంట్రోల్ అవుతుంది. జాన్కంపేట నుంచి నగరంలోకి కొత్త రోడ్ నిర్మించబోతున్నారు.- మస్తాన్​అలీ, ట్రాఫిక్ ఏసీపీ