
- అన్ని కోణాల్లో పరిశీలించి పేరు ఫైనల్
- కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట
- నేడు జిల్లాకు రానున్న అబ్జర్వర్లు
నిజామాబాద్ , వెలుగు : డీసీసీ చీఫ్ పోస్టు కోసం జిల్లా కాంగ్రెస్ నేతలు భారీగా పోటీ పడుతున్నారు. శని, ఆదివారాల్లో 14 మంది అఫ్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ లిస్టు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాకు రానున్నారు. అన్ని కోణాల్లో దరఖాస్తులను పరిశీలించి అబ్జర్వర్లు ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపుతారు. పైరవీలకు తావులేకుండా అబ్జర్వర్లు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగ్‌లు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించనున్నారు.
గత సంప్రదాయానికి చెక్..
జిల్లాలో ముఖ్య నేతలు ఎంపిక చేసిన వారే డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే సంప్రదాయం ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. లీడర్ల పట్ల కనబర్చే విధేయతను ఆధారంగా స్టేట్ కమిటీకి పేర్లు సిఫారసు చేసేవారు. పదవిపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుంటే సమస్యలు తలెత్తి గ్రూపు రాజకీయాలు ఏర్పడేవి. వీటికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానవర్గం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. జిల్లా, స్టేట్ లీడర్స్ అభిప్రాయాలతో పాటు కార్యకర్తల్లో బలం ఉన్న నేతను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు యూత్ లీడర్ల ఓట్లతో ఎన్నుకున్నట్లు డీసీసీ అధ్యక్షున్ని కూడా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో పదవి ఆశిస్తున్న నేతల నుంచి మొదట దరఖాస్తులు తీసుకొని తర్వాత వాటి అర్హతలు పరిశీలించడానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్‌ను అబ్జర్వర్‌గా నియమించింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీపీసీసీ సెక్రటరీలు నర్సింహారెడ్డి, డాక్టర్ రవిబాబు టీం సోమవారం నుంచి వారం రోజులపాటు జిల్లాలో పర్యటించి డీసీసీ చీఫ్ పోస్టుకు ముగ్గురి పేర్లను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కు పంపుతారు.
పెరుగుతున్న పేర్లు..
అధికార కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిపై నేతల్లో క్రేజ్ ఉంది. పార్టీ పరంగా ప్రొటోకాల్ ఉండడం, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే వేళ రాజకీయ గుర్తింపు పొందే చాన్స్ ఉండడంతో భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఇక నుంచి డీసీసీ నార్మల్ పదవి కాదని వచ్చే జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో వారి పాత్ర కీలకంగా ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ఇందూర్లో ప్రకటించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగక అబ్జర్వర్లు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
ఈ క్రమంలో పరిశీలకులు వస్తున్నందున ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు డీసీసీ పోస్టుకు డీసీసీ ఆఫీస్‌లో 14 మంది నేతలు దరఖాస్తులు పెట్టారు. వారిలో మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, మార చంద్రమోహన్, యాదగిరి, గంగాశంకర్, అయప్ప శ్రీను, శేఖర్‌గౌడ్, నరాల రత్నాకర్, జావీద్ అక్రమ్, మూసీపటేల్, నాగరాజు, అలీమ్ తదితరులు ఉన్నారు. దరఖాస్తులు మరిన్ని పెరుగనుండగా సామాజిక వర్గం, కార్యకర్తల్లో పట్టు ఉన్న నేతల పేర్లను ఎంపిక చేసి పది రోజుల్లో పోస్టు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.