ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాష్ట్ర స్థాయి ఉమెన్స్‌‌ హాకీలో  నిజామాబాద్ జిల్లా జట్టుకు మొదటి స్థానం

రెండో స్థానంలో హైదరాబాద్‌‌..

మూడో స్థానంలో మహబూబ్ నగర్

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ టౌన్‌‌లోని మినీ స్టేడియంలో కుండ రఘురాం స్మారకార్థం నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఉమెన్స్ హాకీ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు విన్నర్‌‌‌‌గా నిలిచింది. రెండో స్థానంలో హైదరాబాద్ జట్టు, మూడో స్థానంలో మహబూబ్ నగర్  జట్లు నిలిచాయి. సోమవారం ఉదయం జరిగిన ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో హైదరాబాద్, నిజామాబాద్ జట్లు తలపడ్డాయి.

హోరాహోరీగా సాగిన పోటీలో నిజామాబాద్ రెండు గోల్స్‌‌తో హైదరాబాద్ జట్టుపై  గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌‌కు సీపీ నాగరాజు ముఖ్య​అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆర్మూర్ కు చెందిన సీనియర్ హాకీ క్రీడాకారులు దీప శర్మ, రాణి, సుజాత, కవిత, వనజ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందజేశారు. సోమవారం రాత్రి నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి రాష్ట్ర హాకీ సంఘం చైర్మన్ కొండ విజయ్‌‌కుమార్, అర్జున అవార్డు గ్రహీత, రాష్ట్ర హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి నందనూరి ముఖేశ్‌‌కుమార్, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ పండిత్ వినీత పవన్ చీఫ్‌‌ గెస్ట్‌‌లుగా హాజరై విజేతలకు ట్రోఫీ అందజేశారు.

కార్యక్రమంలో హాకీ సంఘం వైస్​ ప్రెసిడెంట్, కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి, కౌన్సిలర్ జీవి నర్సింహారెడ్డి, జిల్లా హాకీ సంఘం ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి పింజ సురేందర్, హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ భాస్కర్, నూకల శేఖర్, విక్టోబర్ శేఖర్, జిమ్మీ రవి, జి.రవీందర్‌‌‌‌రెడ్డి, అశోక్, రమేశ్ పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలను పరిశీలించాలి 

ట్రైనీ ఐఏఎస్‌‌లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచన

నిజామాబాద్ టౌన్, వెలుగు: ప్రజల అభ్యన్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ట్రైనీ ఐఏఎస్‌‌ ఆఫీసర్లకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం చేసేందుకు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన  ట్రైనీ ఆఫీసర్లతో సోమవారం ఆయన కలెక్టరేట్‌‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులు, పాలనా స్వరూపం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వ్యవసాయం తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, నోడల్ ఆఫీసర్ వసుంధర, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో గోవింద్, కలెక్టరే
ట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు 
పాల్గొన్నారు. 

ప్రజా సంక్షేమమే ధ్యేయం

బోధన్, వెలుగు: ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మన వార్డు మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్‌‌లో భాగంగా సోమవారం పట్టణంలోని 14, 34వ వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, కాలనీల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించాడానికి వచ్చినట్లు షకీల్‌‌ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రవీంద్రయాదవ్, కార్యదర్శి రహీం, మున్సిపల్ వైస్‌‌ చైర్మన్‌‌  సోహెల్, కౌన్సిలర్ నాగవర్దని సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌ వి.ఆర్ దేశాయ్ పాల్గొన్నారు.

అక్రమ కట్టడాల కూల్చివేత

నవీపేట్‌‌, వెలుగు: జన్నేపల్లి విలేజ్‌‌లో ఇరిగేషన్ కాల్వపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఇరిగేషన్ ఆఫీసర్లు సోమవారం కూల్చి వేశారు. అనంతరం డీఈ బలరాం మాట్లాడుతూ కొందరు కాల్వలపై అక్రమంగా షెడ్లు నిర్మించారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సదరు వ్యక్తులు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో వాటిని కూల్చి వేశామన్నారు. 

గ్రామస్తులు సహకరించాలి

కోటగిరి, వెలుగు: గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు వస్తున్న ఆఫీసర్లకు గ్రామస్తులు సహకరించాలని సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీసర్లు కోరారు. ఐదు రోజుల క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్లు సోమవారం మండలంలోని ఎత్తొండ గ్రామానికి వచ్చారు. కోటగిరి తహసీల్దార్ శ్రీకాంత్‌‌రావు, ఇన్‌‌చార్జి ఎంపీడీవో మారుతి, ఎస్సై మచ్చేందర్‌‌‌‌రెడ్డి, సర్పంచ్‌‌ సాయిబాబా వారికి బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరిస్తే తాము వచ్చిన పని సులువు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫారుఖ్, జీపీ సెక్రటరీ ఉమాకాంత్, ఉప సర్పంచ్‌‌ సుజాత పాల్గొన్నారు.

టీఎన్జీవో నిరసన

కామారెడ్డి, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​టీఎన్జీవో, టీజీవో సంఘాల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలపై కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆ  సంఘం ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా జనరల్​సెక్రటరీ సాయిలు, టీజీవో ప్రెసిడెంట్ దేవేందర్‌‌‌‌, సెక్రటరీ సాయిరెడ్డి, ప్రతినిధులు నాగరాజు, దేవరాజు, చక్రధర్, పోచయ్య, చలపతి, రాజ్‌‌కుమార్‌‌‌‌, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఎరువులు ఎమ్మార్పీకే అమ్మాలి

పిట్లం, వెలుగు: ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద ఏడీఏ నూతన్​కుమార్ డీలర్లను  హెచ్చరించారు. సోమవారం బిచ్కుంద ఆఫీసులో డీలర్లతో నిర్వహించిన మీటింగ్‌‌లో మాట్లాడారు. దుకాణం ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, ఎరువులు ఈపాస్ మిషిన్​ ద్వారా మాత్రమే అమ్మాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏవో పోచయ్య, డీలర్లు పాల్గొన్నారు.

దేవునిపల్లి పీఎస్‌‌ ముందు ధర్నా

కామారెడ్డి, వెలుగు: గుడి స్థలం కోసం కామారెడ్డి మండలం ఉగ్రవాయి  గ్రామస్తులు సోమవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌‌ ముందు ధర్నా నిర్వహించారు. గుడి కోసం కేటాయించిన భూమిలో వెంచర్ చేయటానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై అభ్యంతరం తెలిపారనే కారణంలో నలుగురు వ్యక్తులను పీఎస్‌‌కు పిలిపించడంతో వారిని వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు.  శివాలయం నిర్మాణం కోసం 3.15 ఎకరాల భూమిని కొన్నేండ్ల కింద  గ్రామస్తులంతా కలిసి కేటాయించారు. ఇటీవల ఆ భూమిలో వెంచర్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

ఈ విషయంలో సర్పంచ్‌‌ భర్త  జనార్దన్‌‌రెడ్డితో పాటు స్థానికులకు వివాదం నెలకొంది. వెంచర్‌‌‌‌ను అడ్డుకుంటున్నారని పేర్కొంటూ గ్రామానికి చెందిన వెంకట్‌‌రెడ్డి, మల్లేశం, మల్లాగౌడ్, వీరేశంను సోమవారం పీఎస్‌‌కు తీసుకొచ్చారన్నారు. ఈ విషయం తెలిసిన  గ్రామస్తులు స్టేషన్‌‌కు తరలి వచ్చి ఆందోళనకు దిగారు. గుడి భూమిలో పోలీసుల జోక్యం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ఎస్సై ప్రసాద్‌‌ను సంప్రదించగా తమకు ఫిర్యాదు వస్తే స్టేషన్​వచ్చి వివరాలు చూపెట్టమని నలుగురిని పిలిచామన్నారు. వారిని అప్పుడే పంపించామన్నారు.  

పథకాలు అర్హులకు అందేలా చూడాలి

కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మానిటరింగ్ విభాగం ప్రతినిధులకు సూచించారు. సోమవారం  కలెక్టరేట్‌‌లో షెడ్యూల్​ కులాల జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కీమ్స్‌‌పై గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. స్టూడెంట్లకు స్కాలర్​ షిప్స్‌‌ వచ్చేలా చూడాలన్నారు.   ప్రతి నెల చివరి రోజున గ్రామాల్లో అంతరానితనం నిర్మూలనపై అవగాహన ప్రోగ్రామ్స్‌‌ నిర్వహించాలన్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్‌‌‌‌ రజిత, ప్రతినిధులు పుట్ట మల్లికార్జున్, మల్లయ్య, రాజన్న పాల్గొన్నారు.

ప్రజావాణి అప్లికేషన్లను పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంరతం అన్ని శాఖల వద్ద పెండింగ్‌‌లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్​చంద్రమోహన్, డీఆర్డీవో సాయన్న, ఏవో రవీందర్ పాల్గొన్నారు.  

ఇందిర సేవలు మరువలేం

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేమని పలువురు లీడర్లు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో  సోమవారం ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. పిట్లంలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్​ గంగారాం ఆమె ఫొటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్‌లో పీసీసీ ప్రతినిధి మహమ్మద్ ఈసా, ఎన్ఏస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, నాయకులు రత్నాకర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోల ఉషా, కార్యదర్శి కోనేరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. - వెలుగు, నెట్‌వర్క్‌

మాటు కాల్వకు రిపేర్లు చేయరా..? 

మండల సభలో సభ్యుల నిలదీత

నవీపేట్‌‌, వెలుగు: జన్నేపల్లి నుంచి నాళ్లేశ్వర్ వరకు ఉన్న మాటు కాల్వకు రిపేర్లు చేస్తారా లేదా అని సభ్యులు ప్రశ్నించారు. సోమవారం ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ ప్రతి సర్వసభ్య సమావేశంలో తాము సమస్యలు వివరించినా ఆఫీసర్లు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ వర్షాలకు జన్నేపల్లి మాటు కాల్వకు గాండ్లు పడినా ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని  నాళ్లేశ్వర్ సర్పంచ్ సరిన్ ఆరోపించారు. ఇందుకు స్పందించిన డీఈ బలరాం మాట్లాడుతూ కాల్వ మరమ్మతుల కోసం ప్రతి ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నమెంట్‌‌కు పంపనుకన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ హరీశ్‌‌, తహసీల్దార్ వీర్ సింగ్, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంపీటీసీ రాధ, మినా నవీన్‌‌రాజ్‌‌, సర్పంచ్‌‌లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.