ప్రైవేటు మిల్లర్ల దోపిడీ !.. ఆరబెట్టే జాగా లేక పచ్చి వడ్ల అమ్మకం

 ప్రైవేటు మిల్లర్ల దోపిడీ !.. ఆరబెట్టే జాగా లేక పచ్చి వడ్ల అమ్మకం
  • ​క్వింటాల్​కు రూ.1,950 రేటుతో కొనుగోళ్లు
  • పేమెంట్​కు నెల గడువు, వెంటనే కావాలంటే కటింగ్​ 
  • నాలుగున్నర కిలోల తరుగు.. ఇప్పటికీ లక్ష క్వింటాళ్ల వడ్ల సేకరణ 

నిజామాబాద్, వెలుగు : వడ్లను ఆరబెట్టే స్థలాలు లేక రైతులు ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయిస్తూ పచ్చి వడ్లను అమ్ముతున్నారు.  జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వడ్లను నిల్వ చేయలేక, తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మిల్లర్లు క్వింటాల్‌కి రూ.1,950 మాత్రమే ఇస్తున్నారు. 

దీనికితోడు నాలుగున్నర కిలోల  తరుగు తీస్తున్నారు. లోకల్ ఏజెంట్లకు రూ.100 కమీషన్ చెల్లించి, పేమెంట్‌ కోసం నెల రోజుల గడువు విధిస్తున్నారు. వెంటనే డబ్బులు కావాలంటే రూ.1,000కి రూ.200 కటింగ్ చేస్తూ దోచేస్తున్నారు.  ఇప్పటికే గ్రామాల్లో కమీషన్ ఏజెంట్లను నియమించి సుమారు లక్ష క్వింటాళ్ల  వడ్లు సేకరించారు.

తగ్గిన దిగుబడి..  

ఈసారి అధిక వర్షాలు రైతులను ముంచాయి.  జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా,  అధికంగా 4.42 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించడంతో 4 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు.  

సాగునీరు, బోర్లకు కరెంట్ సరఫరా మెరుగుపడటంతో వ్యవసాయ భూములన్నీ సాగులోకి వచ్చాయి.  గత నెలలో కురిసిన భారీ వర్షాలతో 28,131 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మిగతా చోట్ల వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరానికి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా,  35 బస్తాలకు మించలేదు. బోధన్ డివిజన్‌లోని 10 మండలాల్లో 20 రోజుల కిందే కోతలు ప్రారంభమయ్యాయి. వరుస వర్షాలు, తుఫాన్ హెచ్చరికలు అన్నదాతలను  కలవరపెడుతున్నాయి. 

సర్కార్ సేకరణపై ప్రభావం  

 ప్రభుత్వ ధాన్యం సేకరణపై ప్రైవేట్ మిల్లర్ల  ప్రభావం పడుతోంది. జిల్లా సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులు 12.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి అంచనా వేయగా, అందులో 9 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం 661 సెంటర్లు తెరవనున్నారు. ఇప్పటికే బోధన్ డివిజన్‌లోని 108 సెంటర్లు ప్రారంభమయ్యాయి. రైతులకు 17 శాతం తేమతో  ‘ఏ’ గ్రేడ్ వడ్లు క్వింటాల్​కు ధర రూ.2,389, కామన్ రకం క్వింటాల్​కు  రూ.2,369 రేటు నిర్ణయించగా, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. వర్షాల భయం, కల్లాల కొరతతో రైతులు  ప్రైవేట్ మిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.