
- లాటరీ పద్ధతిలో ఖరారు చేసిన కలెక్టర్లు
- మొత్తం సీట్లలో సగం మహిళలకే...
- 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో పెరిగిన సీట్లు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్‌లు లాటరీ తీసి రిజర్వేషన్లను ప్రకటించారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీల నేతల సమక్షంలో, వీడియో రికార్డు మధ్య లాటరీని నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభాను ప్రామాణికం చేసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీ స్థానాలను కేటాయించి, మిగతా వాటిని ఓసీలకు అలాట్ చేశారు. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించారు. ఇన్నాళ్లు ఎంపీటీసీ, జడ్పీటీసీగానో, సర్పంచ్‌గానో పోటీ చేద్దామనుకున్న ఆశావహుల్లో కొందరికి రిజర్వేషన్లు కలిసి రాగా.. మరికొందరి ఆశలు గల్లంతయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 31 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకుగానూ 13 స్థానాలు బీసీలకు, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు స్థానాలు రిజర్వ్ కాగా.. 10 స్థానాలను జనరల్‌కు కేటాయించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉండగా.. 11 స్థానాలు బీసీలకు, ఎస్సీలకునాలుగు, ఎస్టీలకు రెండు కేటాయించగా.. మిగిలిన 8 సీట్లను జనరల్‌కు రిజర్వ్ చేశారు.