
- 9.0 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ టార్గెట్
- 663 కొనుగోలు సెంటర్ల ఏర్పాటు
- మహిళా సంఘాలకు 242 సెంటర్ల అప్పగింత
- సన్నాలు, దొడ్డురకానికి వేరుగా కేంద్రాలు
- అన్ని హంగులతో మోడల్ కేంద్రాల రూపకల్పన
నిజామాబాద్, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోలుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. సివిల్ సప్లయ్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అందించే రిపోర్టుల ఆధారంగా దొడ్డురకం, సన్న వడ్లకు వేర్వేరు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మోడల్ పోలింగ్ సెంటర్ల తరహాలో కొన్ని ప్రత్యేక ‘మోడల్ పర్చేజ్ సెంటర్లు’ ఈసారి రైతుల కోసం ఏర్పాటు కానున్నాయి.
4.42 లక్షల ఎకరాల్లో వరి సాగు
ఈ వానాకాలంలో జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో రికార్డు స్థాయిలో 4.42 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత నెల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 28,131 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మిగిలిన విస్తీర్ణంలో సుమారు 12.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు అంచనా వేశారు. బోధన్ డివిజన్లో పంట కోతలు వారం క్రితం మొదలైనట్లు తెలిపారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అక్టోబర్ 1న నిర్వహించిన మీటింగ్‌లో ప్రైవేట్ మిల్లర్ల దగాకు గురికాకుండా, ప్రభుత్వ కొనుగోలు సెంటర్లనుసిద్ధం చేయాలని కలెక్టర్ఆదేశించారు. 663 సెంటర్లు ఏర్పాటు చేసి 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని విధించారు. వీటిలో మహిళా సంఘాలకు 242 సెంటర్లు అప్పగించనున్నారు. గతేడాది 190 సెంటర్లతో పోలిస్తే మహిళలకు సెంటర్ల సంఖ్య పెంచారు. గవర్నమెంట్ ‘ఏ’ గ్రేడ్ క్వింటాల్‌కు రూ.2,389, కామన్ వెరైటీకి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించగా, సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించనున్నారు.
నిజామాబాద్‌లో మోడల్ వరి కొనుగోలు సెంటర్లు
ఈసారి ప్రత్యేకంగా వడ్ల కొనుగోలుకు కొన్ని మోడల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ల కోసం సొంత బిల్డింగ్‌లు ఉన్న సింగిల్ విండోలను ఎంపిక చేశారు. దొడ్డు, సన్న వడ్లకు వేర్వేరుగా సెంటర్లు ఏర్పాటు చేసి, డైరెక్ట్‌గా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. అన్ని సెంటర్లలో రైతుల నీడ కోసం టెంట్లు, తాగునీరు, తేమను గుర్తించే మెషిన్లు అందుబాటులో ఉంటాయి. సీజన్‌కు కావాల్సిన గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలను సిద్ధం చేశారు.
టార్గెట్ రీచ్ అయ్యేలా ఏర్పాట్లు
వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లలో టార్గెట్ రీజ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 5 నుంచి సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడా సమస్య రాకుండా సమన్వయంతో పని చేస్తాం. రైతులను ఆకర్షించేలా ఈసారి కొన్ని ప్రత్యేక మోడల్ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించనున్నాం.- శ్రీకాంత్ రెడ్డి, డీఎం, సివిల్ సప్లయ్