- సింగరేణిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
హైదరాబాద్, వెలుగు: ఏ సంస్థలోనైనా ఉద్యోగుల సమర్థతను మెరుగుపరిచేలా విజిలెన్స్ ఉండాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితాబ్ ముఖర్జీ అన్నారు. సింగరేణి భవన్‌లో శనివారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పక్షపాతం లేకుండా పనిచేసే వ్యక్తుల వల్లే సంస్థల పని సంస్కృతి మెరుగుపడుతుందన్నారు.
సమయం, పరిస్థితి, ఫలితాలను అంచనా వేసి తగిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమని పేర్కొన్నారు. నిబంధనలకన్నా నైతిక విలువలు గొప్పవన్నారు. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ ఎన్ఎండీసీ భవిష్యత్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి సింగరేణి సిద్ధంగా ఉందన్నారు. దీనిపై స్పందించిన అమితాబ్ ముఖర్జీ.. రానున్న రోజుల్లో బొగ్గు రంగంలో సింగరేణి సహకారాన్ని తీసుకుంటామని, ఇతర మైనింగ్ రంగాల్లోనూ భాగస్వామ్యంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణలో సింగరేణి కృషిని ప్రశంసించారు. తెలంగాణ, ఏపీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజ్‌గోపాల్ శర్మ మాట్లాడుతూ.. నిర్ణయాలు పారదర్శకంగా ఉంటే అవినీతికి అవకాశం ఉండదన్నారు. త్రిపుర మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సింగరేణి మాజీ డైరెక్టర్(పర్సనల్) జీఎస్జీ అయ్యంగార్ మాట్లాడుతూ.. సంస్థ అవసరాలకు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై పారదర్శక విధానం అమలు చేస్తే అవినీతిని నియంత్రించవచ్చని అన్నారు.
కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
