రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినోళ్లకు టీకాలపై నో క్లారిటీ

రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినోళ్లకు టీకాలపై నో క్లారిటీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో18 ఏండ్లు దాటినోళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంపై రాష్ర్ట సర్కార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా బుధవారం నుంచే కొవిన్ పోర్టల్ లో రిజిస్ర్టేషన్ ప్రారంభం అయింది. అయితే రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల కొనుగోలు, లభ్యతపై స్పష్టత వచ్చాక వ్యాక్సినేషన్‌‌ ప్రారంభ తేదీని ప్రకటిస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడు కొవిన్‌‌ పోర్టల్‌‌లో పేర్లు, ఇతర వివరాలు మాత్రమే నమోదు చేసుకోవచ్చన్నారు. ఇది రిజిస్ర్టేషన్ ప్రక్రియ మాత్రమేనని, వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌, తేదీ, టైమ్ స్లాట్ బుక్ చేసుకునే వీలు ప్రస్తుతానికి ఉండదన్నారు. వ్యాక్సినేషన్ డోసుల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధమయ్యాక పూర్తిస్థాయి రిజిస్ర్టేషన్‌‌, స్లాట్‌‌ బుకింగ్‌‌కు అవకాశం ఇస్తామన్నారు. అప్పటివరకూ 45 ఏండ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతుందన్నారు.  
సెకండ్ డోసు ఎక్కడైనా తీసుకోవచ్చు
ఫస్ట్ డోసు ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ లో తీసుకున్నవాళ్లు కూడా ప్రభుత్వ సెంటర్లలో సెకండ్ డోసు తీసుకోవచ్చని శ్రీనివాసరావు చెప్పారు. వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండడం వల్ల సెకండ్ డోస్ పంపిణీకి ఇబ్బంది అవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ సెంటర్లకు వ్యాక్సిన్ డోసులు ఎక్కువగా ఇవ్వడం లేదన్నారు. అందుకే ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్‌‌ను సెకండ్‌‌ డోసు వాళ్లకే ఇవ్వాలని హాస్పిటళ్లకు చెప్పామన్నారు. గవర్నమెంట్ సెంటర్లలో కావాల్సినన్ని వ్యాక్సిన్‌‌ డోసులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 45 ఏండ్లు దాటినోళ్లెవరైనా ఫస్ట్ డోసు లేదా సెకండ్ డోసు కోసం గవర్నమెంట్ సెంటర్లకు రావచ్చన్నారు. రాష్ర్టానికి మంగళవారం మరో లక్షన్నర డోసులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో ఇంకో 4.5 లక్షల డోసులు పంపిస్తామని సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ బుధవారం ఉదయం తెలిపిందన్నారు. 
సీఎం రివ్యూ తర్వాతే.. 
కరోనా వ్యాక్సినేషన్‌‌, ప్రస్తుత పరిస్థితిపై ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష తర్వాత థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్ ప్లానింగ్‌‌పై స్పష్టత రానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోనే నిర్వహించాలా? మాస్‌‌ క్యాంపెయినింగ్ చేపట్టాలా? అనే అంశంపై ఈ మీటింగ్‌‌లో నిర్ణయిస్తారు. ఆ తర్వాతే స్లాట్‌‌ బుకింగ్‌‌ తేదీలను ప్రకటించాలని నిర్ణయించినట్టు హెల్త్ ఆఫీసర్ 
ఒకరు తెలిపారు. 

3 గంటల్లో 80 లక్షల మంది ‘కొవిన్’లో రిజిస్ట్రేషన్ చేసుకున్నరు
పోర్టల్ పని చేస్తోంది.. చిన్న ప్రాబ్లమ్ ఉంటే సరిచేశాం: కేంద్రం


న్యూఢిల్లీ:  మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా 18 నుంచి 44 ఏండ్ల మధ్య వారు కొవిన్ పోర్టల్, ఆరోగ్యసేతు, ఉమంగ్ యాప్ లలో పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆరోగ్య సేతు యాప్ అధికారులు వెల్లడించారు. కొవిన్ పోర్టల్ లో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, అరగంట తర్వాత పోర్టల్ క్రాష్ అయిందని, రిజిస్ట్రేషన్లు కావడం లేదంటూ సోషల్ మీడియాలో పలువురు కంప్లయింట్స్ చేశారు. దీనిపై ఆరోగ్యసేతు యాప్ అధికారులు ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. పోర్టల్ లో చిన్న సమస్య వల్ల రిజిస్ట్రేషన్ లకు ఆటంకం ఏర్పడిందని, సమస్యను వెంటనే పరిష్కరించామని తెలిపారు. కొవిన్ పోర్టల్ లో తొలి 3 గంటల్లోనే 80 లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. బుధవారం మొత్తం ఒక కోటీ 13 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ ఖరారు అయిన తర్వాత వ్యాక్సిన్ వేసుకునేందుకు అపాయింట్ మెంట్లు ఇస్తారని వివరించారు. 45 ఏండ్లు దాటినవారికి మాత్రం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా అందుబాటులో ఉంటుందన్నారు.