నీలగిరి మున్సిపల్‌‌ చైర్మన్‌‌పై..జనవరి 8న అవిశ్వాసం

నీలగిరి మున్సిపల్‌‌ చైర్మన్‌‌పై..జనవరి 8న అవిశ్వాసం
  • క్యాంపునకు తరలివెళ్లిన 34 మంది కౌన్సిలర్లు
  •     ఇప్పటికే కలెక్టర్‌‌‌‌కు తీర్మానం అందజేత
  •     బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన మాజీ ఎమ్మెల్యే 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రమైన నీలగిరి మున్సిపల్‌‌ చైర్మన్‌‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. అవిశ్వాసం తీర్మానంపై కలెక్టర్‌‌‌‌కు ఇప్పటికే నోటీసు అందజేసిన కాంగ్రెస్‌‌,  బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన కౌన్సిలర్లు శనివారం క్యాంపునకు తరలివెళ్లారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌కు మెజార్టీ  కౌన్సిలర్లు లేకపోయినా ఈ స్థానాన్ని ఎక్స్‌‌ ఆఫీషియో ఓట్లతో దక్కించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైస్ చైర్మన్ అబ్బోని రమేశ్‌‌ గౌడ్ మరో ఏడుగురు కౌన్సిలర్లతో కలిసి అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. 

వీరంతా కలిసి మున్సిపల్‌‌ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల కలెక్టర్‌‌‌‌కు నోటీసు అందజేశారు. సోమవారం అవిశ్వాసం పెట్టనుండగా..  క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపాలిటీకి రానున్నారు.  కాగా,  కాంగ్రెస్‌‌లో చేరిన బీఆర్‌‌‌‌ఎస్  కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే విప్‌‌ జారీ చేశారు. 
 
ఎక్స్అఫీషియో ఓట్లతో చైర్మన్​గా ఎన్నికైన సైదిరెడ్డి 

2020లో జరిగిన నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మందడి సైదిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్‌‌గా ఎన్నికయ్యారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులు ఉండగా అందులో 20 వార్డులు కాంగ్రెస్, మరో 20 వార్డులను బీఆర్ఎస్ గెలుపొందింది.  ఇకపోతే బీజేపీ 6 వార్డులు గెలవగా ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1 వార్డును కైవసం చేసుకున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్‌‌‌‌ సైదిరెడ్డి అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి ఓట్లతో  చైర్మన్​ అయ్యారు. 

గతంలోనే అవిశ్వాసానికి సిద్ధమైన కౌన్సిలర్లు

నల్గొండ మున్సిపల్ చైర్మన్‌‌గా సైదిరెడ్డి ఎన్నికైన నాటి నుంచే నల్గొండ మున్సిపాలిటీలో అసమ్మతి నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చైర్మన్ సైదిరెడ్డి ఒంటెద్దు పోకడలతో పాటు తనకు అనుకూలమైన కౌన్సిలర్లకే నిధులు కేటాయించడంతో మిగతా కౌన్సిలర్లు అసమ్మతి రాగంఎత్తారు. పలుమార్లు చైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కౌన్సిలర్ పిల్లి రామరాజు కలిసి 14 మందితో నాగార్జునసాగర్ లో సమావేశం నిర్వహించి చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధం కాగా.. మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. 

కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన మాజీ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు పార్టీ మారడంతో వారికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 ప్రొవిజన్స్ ద్వారా రూల్ నెంబర్ 8 ప్రకారం విప్ జారీ చేశారు.  ఈ నోటీసులను సభ్యులు, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోతే వారి ఇంటికి అంటించారు. విప్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆ సభ్యులపై వారంలోపే వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు బీఆర్ఎస్ విప్​ను ధిక్కరిస్తారా..? అనుసరిస్తారా..? అనే విషయంపై చర్చ నడుస్తోంది. 

8న కౌన్సిల్ సమావేశం

ఈనెల 8న జరగనున్న నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉంది. ఆరోజే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండడంతో 34 మంది కౌన్సిలర్లు శనివారం కుటుంబ సమేతంగా క్యాంపునకు తరలివెళ్లారు.  20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్, 1 ఎంఐఎం కౌన్సిలర్ క్యాంపుకు వెళ్లిన వారిలో ఉన్నారు. వీరంతా సోమవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి నేరుగా హాజరై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది.    కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 విప్ పేరుతో భయపెడుతున్నరు

బీఆర్‌‌‌‌ఎస్ నేతలు విప్ పేరుతో  భయపెట్టాలని చూస్తున్నారని  కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​ బుర్రి శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్​ వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేశ్​ గౌడ్​ ఆరోపించారు. శనివారం  హైదరాబాద్​లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఓ లాగా, అధికారం లేనప్పుడు మరోలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ చట్టం పేరుతో కొత్త డ్రామా స్టార్ట్ చేశారని,  కౌన్సిల్ సభ్యులకు ఇప్పటి వరకు విప్ అందలేదన్నారు.   8వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన వ్యక్తి చైర్మన్ అవుతారని స్పష్టం చేశారు.