వ్యాక్సిన్ వచ్చినా.. సాధారణ ప్రజలకు ఇప్పట్లో లేనట్లే

వ్యాక్సిన్ వచ్చినా.. సాధారణ ప్రజలకు ఇప్పట్లో లేనట్లే

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌‌దీప్ గులేరియా అన్నారు. దేశంలో కరోనా వైరస్ మేనేజ్‌మెంట్‌‌ కోసం ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌‌లో మెంబర్‌‌గా ఉన్న గులేరియా వ్యాక్సిన్ అందుబాటుపై పలు విషయాలు పంచుకున్నారు. భారత మార్కెట్‌‌లో వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సుమారు ఏడాదికి పైగా సమయం పట్టొచ్చన్నారు. సాధారణ ప్రజలు వ్యాక్సిన్ కోసం 2022 దాకా ఎదురుచూడక తప్పదని స్పష్టం చేశారు.

‘మనం దేశ జనాభా చాలా ఎక్కువ. మార్కెట్ నుంచి వ్యాక్సిన్‌‌ను సాధారణ ఫ్ల్యూ వ్యాక్సిన్‌‌లా ఎలా కొనుగోలు చేస్తారో చూడాలి. దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్ పంపిణీని అయ్యేలా చూడాలి. సిరంజ్‌‌లు, నీడిల్స్‌‌ను మారుమూల ప్రాంతాలకు చేర్చడం పెద్ద సవాల్‌‌ కానుంది’ అని గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటుపై ఫారెన్ సెక్రటరీ హర్ష వర్దన్ ష్రింగ్లా కూడా మాట్లాడారు. వ్యాక్సిన్ సప్లయి కోసం 190కి పైగా దేశాలు భారత్‌‌ను సంప్రదిస్తున్నాయని ష్రింగ్లా చెప్పారు. ’ఇండియా తయారు చేసే వ్యాక్సిన్‌‌ను దేశ అవసరాలకే గాక మొత్తం మానవాళికి సాయం చేసేందుకు ఉపయోగిస్తాం. మహమ్మారిపై పోరులో ప్రపంచ ప్రజలు విజయం సాధించేందుకు తోడ్పాటును అందిస్తాం’ అని ష్రింగ్లా అన్నారు.