భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రోజు రోజుకు పాజిటివిటీ రేటు పెరిగిపోతోంది. కొత్తగా 2 లక్షల 38 వేల 18 కేసులు నమోదుకాగా.. మరో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17 లక్షల, 36వే ల 628 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. డైలీ పాజిటివిటీ రేటు 14.43 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా దేశంలో భారీగా పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 8వేల 891కి చేరినట్లు వైద్యశాఖ ప్రకటించింది. కేరళలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ నిన్న ఒక్కరోజే 22,946 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో కొత్తగా 27 వేల 156 మందికి వైరస్ సోకగా.. 14 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 12.45 శాతం ఉంది. ఇక మహారాష్ట్రలో మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా అక్కడ 31 వేల 111 కేసులు వచ్చాయి. కొత్తగా 122 మందికి ఒమిక్రాన్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 33 మంది మృతి చెందారు.  

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. కర్ణాటకలో ర్యాలీలు, ఫంక్షన్స్ పై ఆంక్షలు పెట్టారు. బహిరంగ స్థలాల్లో 200 మందికి మించి ర్యాలీలు నిర్వహించరాదని…. క్లోజుడ్ ప్లేసుల్లో 100 మందికి మించి ర్యాలీలు ఉండరాదని నిబంధన పెట్టింది ప్రభుత్వం. వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేశారు. జిమ్స్, షాపింగ్ మాల్స్ ను 50 శాతం కెపాజిటితో నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు, తమిళనాడు, జమ్మూకశ్మీర్, యూపీ, ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. 50శాతం కెపాసిటీతో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.  ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనే  నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారు. 

కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మురంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 157కోట్ల డోసులు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం.  94 శాతం మంది టీనేజర్లకు ఫస్ట్ డోస్ టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు పిల్లలకు వ్యాక్సినేషన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. మార్చి నుంచి పిల్లలకు వ్యాక్సిన్ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పింది. మరో వైపు కోవిడ్ పేషెంట్స్ కోసం క్లినికల్ మార్గదర్శకాలను కేంద్రం రిలీజ్ చేసింది. చిన్న లక్షణాలు ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తీవ్ర లక్షణాలు ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.