
మే నెలలో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నోయిడాలో తన ప్రియుడితో కలిసి ఉంటున్న పాక్ కు చెందిన సీమా హైదర్‌ను గూఢచారి అని అనడం సరికాదని ఉత్తరప్రదేశ్ పోలీసులు పునరుద్ఘాటించారు. విచారణ పూర్తయ్యే వరకు సీమా హైదర్‌ను బహిష్కరించేది లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
సీమా (30), ఆమె ఇండియన్ లవర్ సచిన్ మీనా (22)లను ఉత్తరప్రదేశ్ పోలీసు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జూలై 17, 18 తేదీల్లో విచారించింది. వారిని గ్రేటర్ నోయిడాలో స్థానిక పోలీసులు జూలై 4న అరెస్టు చేసినప్పటికీ, జూలై 7న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను ఇటీవల ప్రశ్నించి యూపీ పోలీసులు.. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీసా లేకుండా అక్రమంగా దేశంలో ప్రవేశించినందుకు గానూ ఆమెపై ఫైల్ అయిన ఇతర కేసులకు సంబంధించి కూడా వారు ఆమెను విచారిస్తున్నారు. పోలీసులు తమ దర్యాప్తును దాదాపు పూర్తి చేశారు. సీమా హైదర్ పబ్ జీ గేమ్ ఆడుతూ ఆన్‌లైన్‌లో పరిచయమైన సచిన్‌తో కలిసి ఉండటానికి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చినట్లు ఈ దర్యాప్తులో స్పష్టమైంది.
సీమా హైదర్ నుంచి రెండు వీడియో క్యాసెట్‌లు, నాలుగు మొబైల్ ఫోన్‌లు, ఐదు అన్ ఆథరైజ్డ్ పాకిస్థానీ పాస్‌పోర్ట్‌లు, అసంపూర్తిగా ఉన్న ఆమె పేరు, చిరునామాతో ఒక ఉపయోగించని పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. సీమా హైదర్ గూఢచారి అనే ఆధారాలు మాత్రం ఇంకా లభ్యం కాలేదు.