కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ స్టూడెంట్లకు నో ఎంట్రీ

కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ స్టూడెంట్లకు నో ఎంట్రీ
  •     ‘వెలుగు’ కథనంపై స్పందించిన సర్కార్  
  •     అడ్మిషన్ రూల్స్‌‌ మారుస్తూ జీవో జారీ 
  •     పోయినేడు మేనేజ్‌‌మెంట్ కోటాలోనూ మార్పులు 
  •     మనోళ్లకు దక్కనున్న 1,820 ఎంబీబీఎస్ సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 15 శాతం ఉమ్మడి కోటాను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల స్టూడెంట్ల కోసం కేటాయించాలి. రెండు రాష్ట్రాల స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకుని, ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయించాలి. గత 9 ఏండ్లుగా ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. విభజన చట్టంలోని ఈ క్లాజ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా ఏర్పడిన కాలేజీలకు వర్తించదు. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చాక ఏర్పడిన కాలేజీల్లో 15 శాతం కోటాను ఎత్తివేయాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర సర్కార్ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. దీంతో మహబూబ్‌‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట తదితర జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు హైదరాబాద్ చుట్టు పక్కల ఏర్పడిన ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఏపీ స్టూడెంట్లు అడ్మిషన్లు పొందుతున్నారు. 

ఈ తొమ్మిదేండ్లలో వేలాది మంది ఏపీ స్టూడెంట్లు లాభపడగా, అంతే మొత్తంలో తెలంగాణ స్టూడెంట్లు నష్టపోయారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌‌‌‌లో కలిపి 36 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 3,466 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా, ఇందులో ఉమ్మడి కోటా 15% అంటే 520 సీట్లు ఓపెన్ కిందకు వెళ్తున్నాయి. ఇదే విషయాన్ని తెలుపుతూ గత నెల 24న ‘వెలుగు’ ఓ కథనం ప్రచురించింది. అడ్మిషన్ నిబంధనల్లో మార్పు చేస్తే తెలంగాణ స్టూడెంట్లకు న్యాయం జరుగుతుందని పేర్కొంది. ఈ వార్తతో స్పందించిన మంత్రి హరీశ్‌‌రావు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌‌‌‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అడ్మిషన్లలో మార్పులు చేయాలని కోరుతూ హెల్త్ సెక్రటరీకి వీసీ ఓ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్తగా ఏర్పడ్డ 36 కాలేజీల్లో ఉమ్మడి కోటా ఉండదని, పాత కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.  

పోయినేడు ‘బీ’ కేటగిరీ అడ్మిషన్లలో మార్పులు.. 

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సగం సీట్లను కన్వీనర్ కోటా కింద, 35 శాతం సీట్లను బీ కేటగిరీ కింద, ఇంకో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. బీ కేటగిరీ సీట్లకు ఏపీ సహా అన్ని రాష్ట్రాల స్టూడెంట్లను అనుమతించడంపై పోయినేడాది ‘వెలుగు’ కథనం ప్రచురించింది. అప్పుడు స్పందించిన మంత్రి హరీశ్‌‌రావు.. బీ కేటగిరీలో సీట్లలో 85 శాతం లోకల్ స్టూడెంట్లకే రిజర్వ్‌‌ చేస్తూ జీవో తీసుకొచ్చారు. దీంతో సుమారు 1,300 సీట్లు పూర్తిగా తెలంగాణ స్టూడెంట్లకే దక్కే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కన్వీనర్ కోటాలో చేసిన మార్పులతో 520 సీట్లు మనోళ్లకే దక్కే అవకాశం కలిగింది. 

తెలంగాణ సోయితో ఆలోచించినం: హరీశ్ రావు 

మన స్టూడెంట్లకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీశ్‌‌రావు తెలిపారు. స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు మన స్టూడెంట్లకు తమ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సోయితో ఆలోచించిన తమ ప్రభుత్వం.. రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,820 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా చేసిందన్నారు. ఓవైపు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూనే, మరోవైపు ఎక్కువ సీట్లు మన విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘ఈ అకడమిక్ ఇయర్‌‌‌‌లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 2,118 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాగా.. అందులో 900 సీట్లు(43 శాతం) తెలంగాణ నుంచే ఉన్నాయి” అని మంత్రి మంగళవారం ట్వీట్ చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను ప్రజలకు మరింత చేరువ చేసి ఆరోగ్య తెలంగాణ సాకారం చేయాలన్నదే తమ సంకల్పమని అందులో పేర్కొన్నారు.