
న్యూఢిల్లీ: దేశంలో పోర్టులు నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టెర్మినళ్ల నుంచి ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్తాన్ లకు సరుకు రవాణాను నిలిపేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. నవంబర్ 15 నుంచి ఆ దేశాలకు ఎగుమతులు, దిగుమతులు ఉండబోవని స్పష్టం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీ సెజ్) నిర్వహించే టెర్మినల్స్, ఏపీ సెజ్ పోర్టుల్లోని థర్డ్‌పార్టీ టెర్మినళ్లకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. తర్వాతి నోటీసులు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందంది.ఈ ఏడాది సెప్టెంబర్ 13న గుజరాత్‌లోని ముండ్రా పోర్టులో 3 వేల కిలోల డ్రగ్స్పట్టుబడిన నెలలోనే అదానీ పోర్ట్స్ఈ నిర్ణయం తీసుకుంది. ముండ్రా పోర్టులో భారీ స్థాయిలో హెరాయిన్పట్టుబడటంతో అదానీ పోర్ట్స్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రాసెస్ చేయని టాల్క్ పౌడర్‌తో పాటు హెరాయిన్‌ను జంబో బ్యాగుల్లో తరలించారు. ఎవరూ గుర్తించకుండా కంటెయినర్లో కింద బ్యాగుల్లో హెరాయిన్, పై బ్యాగుల్లో టాల్క్ పౌడర్ సెట్ చేశారు. రూ.20 వేల కోట్ల విలువైన ఈ డ్రగ్స్‌ను కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. దేశవ్యాప్తంగా రైడ్స్ చేసి దీంతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీళ్లలో అఫ్గాన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన వాళ్లున్నారు. పోర్టులో డ్రగ్స్ దొరకడంపై సోషల్ మీడియాలో బాగా విమర్శలు రావడంతో అదానీ గ్రూప్ స్పందించింది. ‘దేశంలోని ఏ పోర్టు ఆపరేటర్ కూడా కంటెయినర్లలో ఏముందో చెక్ చేయరు. అందరి పని కూడా పోర్టులు నడిపించడం వరకే. వచ్చి పోయే కంటెయినర్లపై మాకేం పోలీసింగ్ అథారిటీ లేదు’ అని వివరణ ఇచ్చింది.