ఈ- పంచాయతీల్లో .. సౌలత్​లు లేవు

ఈ- పంచాయతీల్లో ..  సౌలత్​లు లేవు

నిజామాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే లక్ష్యంతో మూడేళ్ల కింద ఈ–పంచాయతీలను ప్రారంభించారు. బర్త్​ అండ్ ​డెత్ ​రికార్డుల నమోదు, ఇళ్ల నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య లైసెన్సులు, నల్లా కనెక్షన్లు ఇలా 15 రకాల సేవలను ఇందులో చేర్చారు.  కానీ కంప్యూటర్లు ఉన్న చోట నెట్​సౌకర్యం, నెట్ సౌలత్​ఉన్న చోట ఆపరేటర్లు లేక లక్ష్యం నీరుగారిపోతుంది. నిజామాబాద్​లో 530, కామారెడ్డిలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీ కంప్యూటర్​ కొనాలని గవర్నమెంట్​ఆదేశాలిచ్చింది. 

దీనికోసం గరిష్ఠంగా రూ.50 వేలు ఖర్చు చేసుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆపరేటర్లను పంచాయతీ తరఫున నియమించుకోవాలని స్పష్టం చేసిన పాలకులు నెట్​కనెక్షన్​ ఇస్తామని వెల్లడించారు. కానీ ఇప్పటివరకు మేజర్​ పంచాయతీలకు మాత్రమే  ఈ​సౌకర్యం కల్పించారు. దీనికి తోడు ఆపరేటర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. మండలానికి ముగ్గురికి మించి ఆపరేటర్లు లేరు. వారిపై ఇతర గ్రామాల రికార్డుల నమోదు భారం పడుతోంది. సాంకేతికతపై అంతగా అవగాహన లేని పాత కార్యదర్శులు ప్రజలకు ఆన్​లైన్​ సేవలు అందించడానికి  ఇబ్బందులు పడుతున్నారు. వీరికి శిక్షణ ఇవ్వడంపై ఆఫీసర్లు శ్రద్ధ పెట్టడం లేదు.

దుమ్ముపడుతున్న కంప్యూటర్లు

ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఇప్ప టి వరకు సుమారు 500 కంప్యూటర్లు కొనుగోలు చేశారు. కానీ నెట్​సౌకర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.దీంతో అనేక చోట్ల కంప్యూటర్లు మూలకు చేరాయి. ఎక్కువ రోజులు ఇలాగే ఉంటే పాడైపోయే ప్రమాదం ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల నుంచి ఆపరేటర్లకు జీతాలు ఇవ్వలేమని సర్పంచ్​లు వెనక్కి తగ్గుతున్నారు. ఏదోలా పని పూర్తిచేయాడానికి చాలా వరకు మైనర్ పంచాయతీల కార్యదర్శులు అందుబాటులో ఉన్న మేజర్ పంచాయతీ ఆపరేటర్ల వద్దకో, లేక మండల పరిషత్​ఆఫీసుల్లో ఉపాధిహామీ కూలీల వివరాలు నమోదు చేసే ఆపరేటర్ల దగ్గరకో వెళ్తున్నారు.

పక్క పంచాయతీలతో పనిభారం

గవర్నమెంట్​ నుంచి ఇంటర్నెట్​ ఫెసిలిటీ ఇంకా రాలే.  పౌరులకు ఈ- సేవలు అందిచడానికి కార్యదర్శి మండలాఫీసుకు తరచూ వెళ్లేవాడు. ఇది బాలేదని సొంతగా నెట్​కనెక్షన్​ పెట్టించిన. అప్పటి నుంచి పక్క పంచాయతీల కార్యదర్శులు వారి పనుల కోసం క్యూ​కడుతున్రు. కాదనలేకపోతు న్నమ్, మా పనులు వెనుకబడుతున్నయ్.  

- సిద్ధార్థ్​, సర్పంచ్, మంచిప్ప మేజర్ ​పంచాయతీ