ట్యాక్సీ కార్లకు లోన్లు ఇస్తలే!

ట్యాక్సీ కార్లకు లోన్లు ఇస్తలే!
  • ముందుకు రాని ఫైనాన్స్ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: ట్యాక్సీ కార్లకు లోన్లు ఇచ్చేందుకు ఫైనాన్స్​ కంపెనీలు ముందుకు రావడంలేదు. కరోనా టైంలో లాక్​డౌన్​కారణంగా చాలా మంది కిస్తీలు చెల్లించకపోవ డంతో వేలాది కార్లను ఫైనాన్స్​ కంపెనీలు సీజ్ చేశాయి. అప్పటి నుంచి ట్యాక్సీ కార్లకు వెహికల్ లోన్లు ఇవ్వడం నిలిపివేశాయి. పరిస్థితులు నార్మల్ అయినప్పటికీ లోన్లు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ఒకటి, రెండు కంపెనీలు మినహా మిగతావి వెనక్కి తగ్గుతున్నాయి. ఇచ్చేవి కూడా అనేక కండీషన్లు పెడుతున్నాయి. ట్యాక్సీ కార్లు కొందామంటే దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో డ్రైవర్లు సెకండ్ హ్యాండ్​లో వెహికల్స్ ​తీసుకుంటున్నారు. కొత్త వాటికి ఫైనాన్స్​లు కాకపోతుండటంతో ఎంతోకొంత పెట్టి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని నడుపుకొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకు 10 వేల కొత్త ట్యాక్సీ కార్ల అమ్మకాలు జరుగుతుండగా, సెకండ్ హ్యాండ్ లో 30వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

అంతా నార్మల్ ​అయినప్పటికీ..

లాక్​డౌన్ సమయంలో వెహికల్స్​ను తిప్పలేక చాలా మంది ట్యాక్సీ కార్ల ఫైనాన్స్​లు చెల్లించలేదు. అయితే లాక్​డౌన్ సమయానికి సంబంధించి మారిటోరియం పెట్టకునేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ, ఆ తరువాత కూడా క్యాబ్​ల బిజినెస్ ​లేకపోవడంతో వేలాది మంది ఫైనాన్స్​లు చెల్లించలేదు. దీంతో కార్లను ఫైనాన్స్​కంపెనీలు సీజ్ చేశాయి. ఇలా దాదాపు రాష్ట్రంలో 60 వేల ట్యాక్సీ కార్లు సీజ్ అయ్యాయి. ఆ తరవాత తమ కార్లు తమకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఫైనాన్స్​కంపెనీలు ఇవ్వలేదు. దీంతో చాలామంది ఇతరుల దగ్గర డ్రైవర్లుగా చేరడంతో పాటు కొందరు వేరే ఉద్యోగాల్లో చేరారు. ఇప్పుడు అంతా నార్మల్ కావడంతో సొంత కారు ఉంటే ఎంతో కొంత సంపాదిస్తామని భావిస్తున్నప్పటికీ వారికి ఆధారం దొరకడంలేదు. ఫైనాన్స్​ కంపెనీలు వెహికల్ లోన్లు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

ఐటీ కంపెనీల నుంచి డిమాండ్​

ఐటీ కంపెనీలు ఓపెన్ కావడంతో సిటీలో క్యాబ్​లకు డిమాండ్​ పెరిగింది. కంపెనీలు సంప్రదిస్తున్నప్పటికీ చేతిలో కారు లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. గతంలో ఐటీ  కంపెనీల్లో నడిపిన వారితో 80 శాతం మంది తిరిగి క్యాబ్​లను నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫైనాన్స్​ కోసం పలు కంపెనీల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటంలేదు. ఇస్తున్న కొన్ని కంపెనీల వద్దకు వెళితే గతంలో ట్రాక్ సరిగ్గా లేదంటూ ఇవ్వలేమని తేల్చిచెబుతున్నారు. ఇక చేసేదేమీ లేక చాలా మంది వేరే వారి వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. 

పెరిగిన సెకండ్ విక్రయాలు

కరోనా టైమ్​లో 80 శాతం మంది కార్ ట్యాక్సీ డ్రైవర్లు కిస్తీలు చెల్లించలేదు. దీంతో ఆ కార్లను సీజ్ చేసిన ఫైనాన్స్ కంపెనీలు వాటిని వేలం వేయగా.. ఎక్కువగా ఏజెంట్లు కొనుగోలు చేశారు. అనంతరం వాటికి డిమాండ్​ పెరగడంతో తిరిగి అమ్మేస్తున్నారు. గత రెండేళ్లుగా సెకండ్​హ్యాండ్ విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఒపెన్ అవుతుండటంతో మరింత డిమాండ్ ఏర్పడింది. 

మా ఫ్రెండ్ పేరుపై కారు తీసుకున్న

లాక్​డౌన్ సమయంలో క్యాబ్ నడువకపోవడంతో కిస్తీలు చెల్లించలేకపోయా. దీంతో ఫైనాన్స్​కంపెనీ అప్పట్లోనే కారుని సీజ్ చేసింది. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఓపెన్ కావడంతో మళ్లీ క్యాబ్​లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డౌన్ పేమెంట్ తో మరో ట్యాక్సీ కారు కొందామంటే ఫైనాన్స్ కంపెనీ వాళ్లు నా పేరుపై లోన్ రాదని చెప్పారు. దీంతో మా ఫ్రెండ్ పేరుతో కారు తీసుకొని నడుపుకుంటున్నా. 
–ప్రవీణ్, క్యాబ్ డ్రైవర్, హైదరాబాద్

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి 

ఈఎంఐలు కట్టలేక కరోనా టైంలో చాలా మంది వెహికల్స్ ని వదులుకున్నారు. చెక్కులు బౌన్స్​లు కావడంతో తిరిగి లోన్లు రావడంలేదు. కరోనా సమయంలో లోన్ల ప్రాసెస్​లో జరిగిన చెక్ బౌన్స్​లను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓ కారు కొని కంపెనీల్లో నడిపించుకుందామంటే లోన్ రాక ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం స్పందించి డ్రైవర్లకు న్యాయం చెయ్యాలె.
–షేక్ సలావుద్దిన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్