చనిపోయిన 14 రోజులకు సమాచారమిచ్చిన్రు

 చనిపోయిన 14 రోజులకు సమాచారమిచ్చిన్రు

సంగారెడ్డి, వెలుగు : ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోతే పోలీసులు 14 రోజుల వరకు అతని కుటుంబీకులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆ యువకుడి డెడ్ బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలోనే కుళ్లిపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.  ఝరాసంఘం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ అలియాస్ చిన్న (28) హైదరాబాద్​లో ఫొటోగ్రాఫర్ గా స్థిరపడ్డాడు. గత నెల 18న పుల్కల్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్​ సిబ్బంది అతన్ని సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​కు​ తరలించారు. ఆరు రోజుల ట్రీట్​మెంట్​ తర్వాత డిసెంబర్ 23న శ్రీనివాస్ మృతి చెందాడు. అయితే, అటు పోలీసులు గాని, ఇటు దవాఖాన సిబ్బంది గాని అతని కుటుంబసభ్యులకు తెలియజేయకుండానే డెడ్​ బాడీని మార్చురీకి తరలించారు.  14  రోజుల తర్వాత గురువారం మార్చురీ గది నుంచి  దుర్వాసన వస్తుండడంతో దవాఖానా సిబ్బంది పుల్కల్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి డెడ్​బాడీని మార్చురీ నుంచి బయటకు తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. దాంతో పోలీసులు అతన్ని కిష్టాపూర్ వాసిగా గుర్తించి, అప్పుడు అతడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం దవాఖానకు చేరుకున్న శ్రీనివాస్​ బంధువులు తమకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని పోలీసులు, డాక్టర్ల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్​ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అదే టైంలో సంగారెడ్డిలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు విషయం తెలుసుకుని ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ కు సూచించారు. మంత్రి హామీతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి డెడ్​బాడీని తీసుకువెళ్లీపోయారు.  

ఆధార్​ కార్డు ఉన్నా ఎందుకు గుర్తించలే? 

ప్రమాదం జరిగిన రోజే 108 సిబ్బంది పుల్కల్ పోలీసులకు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు చెప్పామని..వారు స్పందించలేదని డాక్టర్లు అంటున్నారు. శ్రీనివాస్ జేబులో ఆధార్ కార్డున్నా పోలీసులు, డాక్టర్లు గుర్తించకపోవడం ఏమిటని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు 
ప్రశ్నిస్తున్నారు.