ప్రకృతి వనాలకు జాగల్లేవ్

ప్రకృతి వనాలకు జాగల్లేవ్

ప్రతి గ్రామంలో ఎకరంలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ఆదేశం..

అందుబాటులో లేని ప్రభుత్వ భూములు
ప్రైవేట్ భూములు కొనలేక ఇక్కట్లు

హైదరాబాద్, వెలుగు: ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి. స్థలం గుర్తింపు, జంగిల్ క్లియరెన్స్, దున్నడం, మార్కింగ్, వాకింగ్ ట్రాక్, మొక్కలు నాటే పనులు 20 రోజుల్లోగా పూర్తి చేయండి. ఈ వనంలో కనీసం 3 వేల మొక్కలు నాటాలి.
– ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో కింది అధికారులకు ఓ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు.

గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. యాదాద్రిలో న్యాచురల్ ఫారెస్ట్ మాదిరిగా ఎకరం ప్లేస్ లో వేప, రావి, మర్రి, బాదం రకాలకు చెందిన 4 వేల మొక్కలతో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇలాగే అన్ని గ్రామాల్లో వనాలను ఏర్పాటు చేయాలని గత నెల 16న జరిగిన కలెక్టర్ల మీటింగ్ లో సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ వనాల ఏర్పాటుకు చాలా పంచాయతీల్లో జాగాలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న స్థలాల్లో వైకుంఠధామం, డంప్ యార్డులు ఏర్పాటు చేశారు. వాటికి ప్రభుత్వ భూములను గుర్తించడానికే చాలాకాలం పట్టింది.

ప్రభుత్వ భూములు కబ్జా
గతంలో చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికి రెవెన్యూ అధికారుల అండతో కొందరు వారి పేర్ల మీద పట్టా చేయించుకున్నారు. వీటిలో చెరువు శిఖం భూములే అధికంగా ఉన్నాయి. దీంతో గ్రామంలో ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీలను ఏర్పాటు చేసింది. ఏడాదిన్నర నుంచి ప్రభుత్వ భూములు గుర్తించటం, వాటిని చదును చేయటం, రోడ్డు వేయటం ఇలా పనులు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాలు ఉండగా 10 వేలకు పైగా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్ యార్డులు ఏర్పాటయ్యాయి. ఇక నర్సరీలకు స్థలం లేకపోవడంతో మామిడి తోటలు, రైతుల భూముల్లో కొంత అద్దెకు తీసుకుని నర్సరీలను నిర్వహిస్తున్నారు.

ఉపాధి నిధులతో అభివృద్ధి
గ్రామంలో గుర్తించిన ఎకరా స్థలాన్ని కల్టివేటర్ తో రెండుసార్లు, ట్రాక్టర్ తో ఒకసారి దున్నాలని ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. ఈ పనులను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టాలని సూచించింది. ఎకరం ప్లేస్ లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయటంతో పాటు వాకింగ్ ట్రాక్, కూర్చునేందుకు 5 బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించింది.అయితే ప్రభుత్వ భూములు లేని గ్రామాల్లో ఈ భూమి ఎలా సేకరించాలన్నది గైడ్ లైన్స్ లో పేర్కొనలేదు. భారీగా ధరలు ఉండటంతో ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనటానికి పంచాయతీల దగ్గర నిధులు లేవని పలువురు సర్పంచ్ లు చెబుతున్నారు. గైడ్లైన్స్ మేరకు అన్ని గ్రామ పంచాయతీలు వివరాలను గత నెల 27కల్లా పంపాలని ఆదేశించింది. అయితే రెవెన్యూ అధికారులు భూములను చూపించకపోవటంతో ఈ గడువును ఈ నెల 3 వరకు పెంచింది. అప్పటికీ వివరాలు అందకపోవడంతో మళ్లీ గడువు పెంచే అవకాశముంది.

నివేదికల్లోనే భూమి
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ నెల 6వ తేదీ వరకు 8,471 గ్రామాల్లో ప్రకృతి వనాలకు ఎకరా ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు పంచాయతీరాజ్ అధికారులు నివేదిక పంపారు. మిగతా 4,280 గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేదని తెలిపారు. అయితే ఈ ఎకరం ల్యాండ్ గుర్తించి వివరాలు పంపేందుకు అధికారులు వారం రోజులు మాత్రమే టైమ్ ఇవ్వటంతో రెవెన్యూ అధికారులు ఏదో ఒక సర్వే నంబర్ వేసి నివేదిక పంపారని సర్పంచ్ లు చెబుతున్నారు. కేవలం సర్వే నంబర్ ఇచ్చారని, అంతే తప్ప ఆ ఎకరా భూమి ఎక్కడ ఉంది, వాటికి హద్దులు, రోడ్డు వంటి విషయాలను సర్పంచ్, గ్రామ కార్యదర్శికి రెవెన్యూ అధికారులు చూపించలేదని చెబుతున్నారు.

స్పష్టత లేదు
ప్రకృతి వనం పేరుతో గ్రామంలో ఎకరంలో 4 వేల మొక్కలను నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించాలని రెవెన్యూ అధికారులకు లెటర్ రాశాం. వాళ్లు ఎకరం భూమి ఇస్తే దాన్ని చదును చేసి మొక్కలు నాటడం వంటి పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వ భూములు లేనిచోట ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అందుకు అనుగుణంగా ముందుకు వెళతాం.
– మేడ్చల్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి

గుట్టలు, చెరువులున్న భూములను చూపిస్తున్నారు
యాదాద్రి తరహాలో గ్రామంలో ఎకరం స్థలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పింది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూము ల సర్వే నంబర్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ భూములు ఎక్కడ ఉన్నయో చూపించలేదు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు కొన్నిచోట్ల గుట్టలు, రాళ్లతో పాడుబడి ఉన్నాయి. వాటిని బాగు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మా గ్రామంలో చెరువు శిఖం భూమి రెవెన్యూ అధికారులు చూపించారు. వాటిలో నిండా నీళ్లున్నాయి. అక్కడ ప్రకృతి వనం ఎలా ఏర్పాటు చేయాలో వాళ్లకే తెలియాలి. టైమ్ తక్కువ ఇచ్చి ప్రకృతి వనం ఏర్పాటు చేయాలంటే ఎలా కుదురుతుంది. గత నెల 29న చెప్పి ఈ నెల 3కల్లా చేయమన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలా సాధ్యమవుతుంది.
మహబూబాద్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి

రెవెన్యూ వాళ్లు భూములు చూపించాలి
ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాని రెవెన్యూ వాళ్లు గ్రామంలో ప్రభుత్వ భూమి ఎక్కడుందో చూపించలేదు. గ్రామంలో ప్రభుత్వ భూమి చూపించకుండా సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఏం చేయలేరు. గ్రా మాలవారీగా కబ్జా అయిన భూములను ప్ర భుత్వం స్వాధీనం చేసుకోవాలి. చాలా గ్రా మాల్లో ప్రభుత్వ భూములు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీలు భూమి కొనడం అసాధ్యం.
– ప్రణీల్ చందర్, సర్పంచ్, మహబూబ్ నగర్ జిల్లా

For More News..

రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

వట్టి డిగ్రీలతో లాభం లేదు