బెంగళూరులో నో లాక్‌డౌన్: యడ్యూరప్ప

బెంగళూరులో నో లాక్‌డౌన్: యడ్యూరప్ప

బెంగళూరు: బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్ విధించబోమని కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. బెంగళూరులో కరోనా ఉధృతిని తగ్గించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు తెలిపారు. గాడిలో పడుతున్న రాష్ట్ర ఎకానమీ కూడా తమకు అంతే ముఖ్యమన్నారు. బెంగళూరులో గత కొద్ది రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిందని, అందరూ సహకరిస్తే మహమ్మారిని కంట్రోల్ చేయొచ్చన్నారు. మిగతా సిటీలతో పోలిస్తే కరోనా కేసుల విషయంలో బెంగళూరు సేఫ్ అని కర్నాటక రెవెన్యూ మినిస్టర్ ఆర్‌‌.అశోక మాట్లాడిన మరుసటి రోజే సీఎం యడ్యూరప్ప తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఏ కారణం వల్లనైనా మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రశ్నే తలెత్తదు. కేసుల సంఖ్య అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మేం ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం. ఆ ఏరియాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధింపునకు ఆస్కారం లేదు. మా పార్టీతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా మంత్రులతోనూ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. వారి సహకారంతో బెంగళూరులో మహమ్మారిని నియంత్రించడానికి శక్తి వంచన లేకుండా అన్ని విధాలా యత్నిస్తాం’ అని యడ్యూరప్ప చెప్పారు.