ఎన్ని దౌర్జన్యాలు చేసినా జనం తిప్పికొట్టారు

ఎన్ని దౌర్జన్యాలు చేసినా జనం తిప్పికొట్టారు
  • ఎన్ని దౌర్జన్యాలు చేసినా జనం తిప్పికొట్టారు
  • డబ్బులు ఖర్చు పెట్టి గెలుద్దామనుకునే వారికి చెంపపెట్టు
  • కష్టాల్లో అండగా నిలిచినందుకే జనం ఈటలకు జై కొట్టారు
  • బీజేపీ, మోడీ, అమిత్ షాలపై దుష్ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు 
  • కేసీఆర్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీనే
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా జనం తిప్పికొట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందన్నారు. వీ6 న్యూస్ లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలుద్దామనుకునే వారికి హుజూరాబాద్ ఉప ఎన్నిక చెంపపెట్టులాంటిదని విశ్లేషించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖరారు కాకముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ లీడర్లనందర్నీ కొనేసి..  వ్యతిరేకంగా పనిచేస్తారనుకునే వారిని, అనుమానం వచ్చినవారందరిపై కేసులు పెట్టి బెదిరించడం.. దౌర్జన్యాలకు పాల్పడడం.. డబ్బులు, పదవులు ఆశ పెట్టి ప్రలోభాలకు గురిచేసినా జనం మాత్రం మౌనంగా తమ పని తాము చేసి కేసీఆర్ కు సరైన  బుద్ధి చెప్పారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 
మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ పై కుట్ర పూరితంగా వ్యవహరించి కక్ష సాధింపులకు దిగారనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైందని.. ఎల్లప్పుడూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని.. కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవడేమే కాదు.. అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలబడినందుకే జనం ఈటలకు అండగా నిలిచారని విశ్లేషించారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రబలి భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో అప్పుడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ధైర్యంగా ఆస్పత్రుల చుట్టూ తిరిగి ప్రజలకు సేవ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం మొదలైన వెంటనే కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల వారిని, ఈటల అనుచరులందర్నీ కొనేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. చరిత్రలో తెలంగాణ ప్రజలు నిజాం  నియంతృత్వ పాలనను వ్యతిరేకించినట్లే ఇప్పుడు అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ సర్కారును వ్యతిరేకించారని పేర్కొన్నారు.  ఏడేళ్లుగా  హామీలు అమలు కానందుకే.. జనం ఆగ్రహంతో బుద్ది చెప్పారని విశ్లేషించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు హుజూరాబాద్ ప్రజలు చెక్ పెట్టారని తెలిపారు. 
ఎన్నికల ముందు డబ్బులు ఖర్చు చేసి గెలవాలనుకునే వారికి గుణపాఠం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కేవలం ఎన్నికల ముందు డబ్బులు వెదజల్లి.. విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుద్దామనుకునే వారికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు సరైన గుణపాఠం నేర్పాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లీడర్లను ఎక్కడికక్కడ కొనేయడంతోపాటు.. వ్యతిరేకంగా లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తారనుకునే వారిపై పోలీసు కేసులు పెట్టి బెదిరించి దౌర్జన్యాలు చేయడం.. మరీ ముఖ్యంగా  ఓటుకు 6 వేలు చొప్పున 400 కోట్లు పంచి ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు లొంగలేదన్నారు. మరీ ముఖ్యంగా దళితబంధు స్కీం పేరుతో  ఓట్లను కొనాలని ప్రయత్నించారని ఆరోపించారు. దళిత బంధు మాత్రమే కాదు..ఇంకా అనేక పథకాల పేరుతో హుజూరాబాద్ లో 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినా జనం కేసీఆర్ ను నమ్మలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈటలకు మెజారిటీ రావడం అంటే ప్రజలు న్యాయం.. ధర్మం వైపు ఉండాలని నిర్ణయించుకున్నారని అర్థమవుతుందన్నారు. స్వర్గీయ వెంకటస్వామి హయాంలో హుజూరాబాద్ ఆయన పార్లమెంటు పరిధిలోనే ఉండేదని గుర్తు చేస్తూ..  నిన్న రాత్రి కౌంటింగ్ ఏజెంట్లతో ఈటల రాజేందర్ మాట్లాడుతున్న సందర్భంగా ఇదే విషయం చెప్పారని తెలిపారు. 
తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
బీజేపీకి వ్యతిరేకంగా.. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా ప్రజలు కేసీఆర్ ను, టీఆర్ఎస్ నాయకులను పట్టించుకోలేదని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో కేసీఆర్ కు భయం మొదలయిందని.. తనకు ఎదురులేదన్న రీతిలో.. కుటుంబ పాలనతో.. నియంతృత్వంగా పాలిస్తున్న పాలన చేస్తూ.. అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పారని వివరించారు. దళితబంధు పథకాన్ని ప్రకటించినప్పుడు గేమ్ ఛేంజర్ అని అన్నా ఎవరూ పట్టించుకోలేదని.. కేవలం ఈటలను అణచివేయాలన్న అహంకారంతోనే ఈ పథకాలన్నీ తెస్తున్నాడని జనానికి స్పష్టంగా అర్థమైందన్నారు. 
దళితులందరూ కేసీఆర్ కు వ్యతిరేకమే
దళితులంతా కేసీఆర్ కు వ్యతిరేకమేనని హుజూరాబాద్ ఉప ఎన్నిక తాజా నిదర్శనమన్నారు. దళిత బంధు స్కీం పెట్టి.. 10 లక్షలు ఇచ్చి.. మొత్తం రాష్ట్రమంతా ఇస్తానంటూ.. చింతమడకలో ఎలాంటి సర్వే చేయకుండానే ఇవ్వడం మొదలుపెట్టినా దళితులే కాదు జనం ఎవరూ పట్టించుకోలేదని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల ముందు దళిత సీఎం అని మోసం చేశారు.. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులకు అన్యాయం చేయడం, 3 ఎకరాల భూమి ఇస్తాడని ఎదురు చూసి ఆశాభంగం చెందారని, అవే మూడు ఎకరాలు ఇచ్చి ఉంటే.. దాని విలువ 50 లక్షలు అయ్యేదని దళితులు భావించారని ఆయన విశ్లేషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మాట్లాడినప్పడు ఈటల రాజీనామా వల్లే కేసీఆర్ పథకాలన్నీ పెడుతున్నాడని చెప్పారని.. మొత్తం రాష్ట్రమంతా మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే బాగుండు అనే ఆలోచన చేశారని తెలిపారు. బంగారు తెలంగాణ అని మభ్యపెడుతూ ఎలాంటి ఉద్యోగాలివ్వకపోతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం వంటి పరిణామాలన్నీ కేసీఆర్ పై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయన్నారు. ఎన్ని రకాల ఆశ పెట్టినా జనం ఆగ్రహంతో తిప్పికొట్టారని, 
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి సొంత మండలం వీణవంకలోనే బీజేపీ అభ్యర్థి ఈటలకు మెజారిటీ రావడం టీఆర్ఎస్ పట్ల జనాగ్రహానికి నిదర్శనమని వివేక్ వెంకటస్వామి విశ్లేషించారు.
కల్వకుంట్ల కుంటుంబ పాలనను జనం ఒప్పుకోలేదు
కల్వకుంట్ల కుటుంబ పాలనను జనం ఒప్పుకోలేదని హుజూరాబాద్ ఉప ఎన్నిక రుజువు చేసిందని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బాగుపడుతుందనుకుంటే..ఆంధ్రా దోపిడీయే జరుగుతోందని, సాగునీటి ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికే కట్టబెట్టడం, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం.. వంటివన్నీ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకునేలా చేశాయని వివరించారు. కేవలం ఎన్నికల ముందు వచ్చి జనాన్ని మభ్యపెడదామనుకుంటే చెల్లదని హుజూరాబాద్ ప్రజలు రుజువు చేశారని పేర్కొన్నారు.