మహాత్ముడి ఆశ్రమం విజిట్: గాంధీజీ ప్రస్తావన లేని ట్రంప్ నోట్

మహాత్ముడి ఆశ్రమం విజిట్: గాంధీజీ ప్రస్తావన లేని ట్రంప్ నోట్

రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమ సందర్శనకు వెళ్లారు. అక్కడ ఆయన విజిటర్స్ బుక్‌లో రాసిన సందేశం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహాత్మా గాంధీజీ ఆశ్రమ సందర్శన ముగిసిన తర్వాత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెబుతూ నోట్ రాశారు. ‘టూ మై గ్రేట్ ఫ్రెండ్ పీఎం మోడీ .. థ్యాంక్యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ విజిట్ (ఈ అద్భుతమైన సందర్శనకు నా మిత్రుడు మోడీకి ధన్యవాదాలు)’ అని పేర్కొన్నారు ట్రంప్. అయితే మహాత్ముడి ఆశ్రమాన్ని సందర్శించి.. బాపూజీ గురించి గానీ, ఆయన సత్యాగ్రహ ఉద్యమం గురించి గానీ, అహింస బోధన గురించి గానీ ఒక్క మాట కూడా ట్రంప్ రాయకపోవడం గమనార్హం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండ్రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ రోజను ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా స్వాతంత్ర్యోద్య సమయంలో మహాత్మా గాంధీజీ ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు ట్రంప్, ఆయన భార్య మెలనియా ట్రంప్. ఈ ఇద్దరి వెంట ఉండి ప్రధాని మోడీ ఆశ్రమం గాంధీ జీవితంలో ఆశ్రమం ప్రత్యేకత, చరఖా గురించి వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్ అక్కడున్న చరఖాపై నూలు వడికారు. ఆ తర్వాత వారికి గాంధీజీ మూడు కోతుల మార్బుల్ విగ్రహాన్ని బహూకరించారు మోడీ. అక్కడి నుంచి వీడ్కోలు చెబుతూ.. థ్యాంక్యూ మోడీ అంటూ విజిటర్స్ బుక్‌లో తన సందేశాన్ని రాసి సంతకం చేశారు ట్రంప్. అనంతరం అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్‌’ గ్రాండ్ ఈవెంట్‌కు వెళ్లి.. అక్కడ ప్రసంగించారు.