పే కమిషన్లకు గుడ్​బై?

పే కమిషన్లకు గుడ్​బై?

‘మాకేం.. ప్రభుత్వ​ ఉద్యోగులం. సర్కార్లు ఐదేళ్లకోసారి మారతాయేమో గానీ మేం మాత్రం పాతిక, ముప్పై ఏళ్ల పాటు కుర్చీలోనే ఉంటాం. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండి’.. ఇదీ చాలా మంది గవర్నమెంట్​ ఎంప్లాయ్స్​లో ఉండే ఫీలింగ్​. సెంట్రల్​ గవర్నమెంట్​ స్టాఫ్​లో అయితే ఈ ధీమా మరీ ఎక్కువ.

‘వాళ్లకేంటండీ.. సర్కారీ బాబులు. పనిచేసినా చేయకున్నా ఒకటో తారీఖున ఠంచన్​గా శాలరీ వస్తుంది. ఐదేళ్లకోసారి జీతాలు పెరుగుతాయి. ఆఫీసుకు వచ్చినా రాకున్నా వాళ్లను అడిగేవాళ్లు లేరు. అందుకే దేశం ఇలా తయారైంది. ఈ దుస్థితి ఎప్పుడు మారుతుందో?’.. ఇదీ మెజారిటీ జనంలో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహం.

కానీ.. పైన చెప్పుకున్న ఈ పరిస్థితులు మారే రోజులు మరెంతో దూరంలో లేవు. ప్రజలకు ‘అచ్ఛే దిన్​’ తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సిన్సియర్​గా పనిచేసే సెంట్రల్​ గవర్నమెంట్​ ఉద్యోగులకు మెరిట్​, పనితీరు ఆధారంగా జీతభత్యాలు, ప్రమోషన్లు నిర్ణయించే సిస్టమ్​ను అమల్లోకి తేనుంది. ఆఫీసర్లు ఎలా పనిచేస్తున్నారనే దానిపై పబ్లిక్​ ఇచ్చే ఫీడ్​బ్యాక్​ను కూడా పరిగణనలోకి తీసుకోనుంది. దీన్నిబట్టి ఇది పని దొంగలకు తప్ప అందరికీ గుడ్​ న్యూసేనని చెప్పొచ్చు.

ఉద్యోగులకు శాలరీలు, ఇంక్రిమెంట్లు, టీఏ, డీఏ వంటి ఇన్​సెంటివ్స్ ఎంత పెంచాలో సూచించేందుకు కేంద్రం ఐదేళ్లకోసారి పే కమిషన్లను నియమించడం సర్వసాధారణం. పెరిగిన నిత్యవసరాల రేట్లకు అనుగుణంగా పే కమిషన్లు రికమండేషన్లు చేసేవి. అయితే సెంట్రల్​ గవర్నమెంట్​ ఈ పద్ధతికి ఇక గుడ్​బై చెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ పాత విధానానికి ఫుల్​ స్టాప్​ పెట్టి, దాని ప్లేసులో కొత్తగా ఆక్రాయిడ్​ ఫార్ములాను ప్రవేశపెట్టనుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

సెవెన్త్​ పే కమిషనే చివరిదా?

7వ పే కమిషన్ రికమండేషన్ల​ను కేంద్రం 2016 జూన్ 29న ఓకే చేసింది. దీంతో సెంట్రల్​ గవర్నమెంట్​ ఉద్యోగుల కనీస శాలరీ (నెలకు) రూ.7 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. పే బ్యాండ్​లు​, గ్రేడ్​ పే, ఇన్​సెంటివ్​లు, పెన్షన్లు​ తదితరాలను కొత్త పే మ్యాట్రిక్స్​ ప్రకారమే అందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పదేళ్లకోసారి కాకుండా క్రమంతప్పకుండా పెంచాలని కూడా సెవెన్త్​ పే కమిషన్​ సూచించింది. ఆక్రాయిడ్​ ఫార్ములా అమల్లోకొస్తే ఈ కమిషనే చివరిది కానుంది. ఇకపై శాలరీలు పెంచడంలో పనితీరే టాప్​ ప్రయారిటీ అవుతుంది.

పనిచేయకుంటే ఇంటికే!

మోడీ సర్కారు అమల్లోకి తీసుకువస్తుందని భావిస్తున్న న్యూ రేటింగ్​ ఫార్ములాతో పని దొంగలు దారిలోకి వస్తారని ప్రజలు భావిస్తున్నారు. వాళ్లు ఇకపై ఒళ్లు దాచుకోకుండా డ్యూటీ చేస్తారని చెబుతున్నారు. పద్ధతి మార్చుకోనివాళ్లను ప్రభుత్వం పర్మనెంట్​గా ఇంటికి పంపిస్తుందని ఆశిస్తున్నారు. కేంద్ర హోం శాఖ లెక్కల ప్రకారం గత ఐదు నెలల్లో 1083 మంది కింది స్థాయి​ సిబ్బంది కొలువులు కోల్పోయినట్లు సమాచారం. కొత్త సిస్టమ్​ వస్తే ఈ డ్రైవ్ ఊపందుకోనుందని, బ్యూరోక్రసీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్​గా మారతాయని చెప్పొచ్చు.   ​                 ​ ​

ఎవరీ ఆక్రాయిడ్​?

ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారం సెంట్రల్​ గవర్నమెంట్​ ఉద్యోగుల జీతాలను ఇన్​ఫ్లేషన్​(ద్రవ్యోల్బణం)తోపాటు వాళ్ల ఫెర్ఫార్మెన్స్​తో లింక్​ చేస్తారు. ఈ సూత్రాన్ని వాలస్ రడెల్​ ఆక్రాయిడ్ అనే  ప్రముఖ ఇంటర్నేషనల్​ న్యూట్రిషనిస్ట్​ రికమండేషన్ల మేరకు రూపొందించారు. ఈయన యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ ‘ఫుడ్​ అండ్​ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్​’లో న్యూట్రిషన్​ డివిజన్​ తొలి డైరెక్టర్​. ఆక్రాయిడ్​ మన దేశంలోని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే తిండి, బట్టల రేట్లలో మార్పులను దృష్టిలో పెట్టుకొని రికమండేషన్లు చేశారు.