
- గత ఒప్పందాలకు సపోర్ట్ మాత్రమే చేస్తామన్నామని క్లారిటీ
వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అత్యాధునిక ఏఐఎం-120 క్షిపణులు ఇస్తోందంటూ వచ్చిన వార్తలు తప్పని అమెరికా స్పష్టం చేసింది. ఇది పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచే చర్య కాదని తెలిపింది. 2007లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, రిపేర్ భాగాలు మాత్రమే అందిస్తున్నామని అమెరికా క్లారిటీ ఇచ్చింది.
ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం చెప్పింది. ఈ మార్పులు పాక్‌కు గతంలో ఇచ్చిన ఎఫ్-16 విమానాలకు సంబంధించినవి మాత్రమే అని వివరించింది. ఇటీవల అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాక్‌కు సీ8, డీ3 రకాల మిసైల్స్ ఇస్తున్నారని పాక్ మీడియా ప్రచారం చేసింది.
అయితే తాజాగా అమెరికా ఈ వార్తలు తప్పని తోసిపుచ్చింది. 2007లో పాక్ 700 క్షిపణులు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఒప్పందాలకు అనుగుణంగా మాత్రమే సపోర్ట్ ఉంటుందని తెలిపింది. ఇటీవల అమెరికా–పాక్ సంబంధాలు మెరుగవుతున్నప్పటికీ, భారత్‌తో ఘర్షణల సమయంలో ఉపయోగించిన క్షిపణులు కొత్తగా ఇచ్చినవి కాదని స్పష్టం చేసింది.