
- ఆఫీసర్లకు 150 జీపీల ఏర్పాటుపై వినతులు
- జనాభా, విస్తీర్ణంపై పరిశీలిస్తున్న అధికారులు
- అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలు
- క్యాబినెట్ మీటింగ్లో 47 కొత్త జీపీలకు ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య మరింతగా పెరగనుంది. ప్రస్తుతం 12,769 పంచాయతీలు ఉండగా మరో 150 జీపీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. తండాలు, ఆవాసాలును కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. కొత్త జీపీల ఏర్పాటుపై నిత్యం సీఎంవో ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ల నుంచి వినతిపత్రాలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ జీరో అవర్ లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జీపీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇందుకు సీఎం ఒకే అన్నట్లు మంత్రులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ లో 47 కొత్త జీపీలు, 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 150 కొత్త వినతులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనాభా, విస్తీర్ణం, తండాలు ఆధారంగా వినతులను పరిశీలించి త్వరలో ప్రభుత్వానికి పీఆర్ అధికారులు రిపోర్ట్ అందజేయనున్నారు. కొత్త గ్రామ పంచాయతీల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
ఇటీవల భూపాలపల్లి , ములుగు జిల్లాలో ట్రైబల్ ఏరియాల్లో ఉన్న సుమారు 25 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 2018 కి ముందు 500 జనాభా దాటిన తండాలను, పెద్ద గ్రామ పంచాయతీలను విడదీసి సుమారు 4,500 కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎంవో ఆఫీసర్లు, మంత్రుల నుంచి ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయని అంటున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో పఠాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు పేరుతో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ కేసీఆర్ నగర్ పేరుతో సుమారు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని ప్రభుత్వం నిర్మించింది. ఇందులో లబ్ధిదారులు చేరాక ఇక్కడి జనాభా 60వేలకు చేరుతుంది. రాష్ట్రంలో 20,25వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి. వాస్తవానికి 60 వేల జనాభాకు రెండు మున్సిపాలిటీలు చేయాల్సి ఉన్నా వసతులలో ఇబ్బందులు ఏర్పడుతాయని ఒకటే మున్సిపాలిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కార్పొరేషన్ ఏర్పాటుకు పలు డిమాండ్లు ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తున్నది.