
సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన పోషకాలు అందేలా చూడాలని, పోషకాహార లోపంతో పిల్లలెవరూ బాధపడకూడదని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. శుక్రవారం జడ్పీ ఆఫీస్ లో స్థాయి సంఘాల సమావేశాన్ని ఆమె అధ్యక్షతన నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళికల అంశాలపై సమావేశాల్లో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తరపున అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారం అందించాలని సూచించారు. బాల్య వివాహలపై దృష్టి పెట్టాలన్నారు. సఖి సెంటర్ వివరాలు అందరికీ తెలిసేలా చేయాలని సూచించారు. హాస్టళ్లలో స్టూడెంట్స్ కు భోజన సదుపాయం సరిగా ఉండేలా చూసుకోవాలని, కొన్ని చోట్ల పురుగులు పడ్డ భోజనం తిని స్టూడెంట్స్ అస్వస్థతకు గురవుతున్నారని, అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలన్నారు.
నీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కనగండ్ల కవితా తిరుపతి, రణం జ్యోతి, లింగాయపల్లి యాదగిరి, సిలువేరు సిద్ధప్ప, కడతల రవీందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ రమేశ్, డిప్యూటీ సీఈవో సుమతి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది ఉండొద్దు
మెదక్ టౌన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్అనిల్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్టు సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్లలో ధాన్యం నిల్వకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ 2015లో 24 లక్షల మెట్రిక్ టన్నులు జరిగితే 2020 నాటికి 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని, కానీ అందుకు అనుగుణంగా మిల్లింగ్ శాతం పెరగకపోవడంతో ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. అనంతరం ఆయన మెదక్ మండలంలోని రాజ్‌పల్లి, మంబోజిపల్లిలో ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు.
మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలి
మెదక్ టౌన్, వెలుగు : మెదక్‌జిల్లా వ్యాప్తంగా మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలని, వీటిని స్కూళ్ల సమీపంలో విక్రయించకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సంబంధిత ఆఫీసర్లను మెదక్ అడిషనల్కలెక్టర్ ప్రతిమాసింగ్ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, ఎక్సైజ్, ఎడ్యుకేషన్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పాఠశాలల దగ్గర గుట్కా, పాన్ మసాలా, సిగరెట్లు, గంజాయి లాంటివి అమ్మకుండా చూడాలన్నారు. ఈ విషయమై పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలో కూడా చర్చించాలని, విద్యార్థుల తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, మెదక్ డీఎస్పీ సైదులు, డీఈవో రమేశ్కుమార్, డీఎస్వో రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ల్యాండ్ సర్వే ఆఫీసర్
మెదక్, మెదక్ టౌన్, వెలుగు: లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ గంగయ్య ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రామానికి చెందిన రైతు సాంబార్ మల్లేశం తన భూమి బౌండరీ డిజిటల్ సర్వే కోసం గత మే 5న దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయితే గంగయ్య సర్వేకోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. బతిమిలాడుతే రూ.80 వేలకు తగ్గాడు. ముందు గా అడ్వాన్స్ రూ.10 వేలు ఇచ్చాడు . మిగతా రూ.70 వేలలో ఒకసారి రూ.30 వేలు ఇచ్చి, సర్వే పూర్తి అయ్యాక రూ.40 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ క్రమంలో మల్లేశం ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం రాత్రి గంగయ్య తన ఆఫీస్ లోనే మల్లేశం నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2014లో కూడా గంగయ్య నిజామాబాద్ లో లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడగా ఆ కేసు ఇంకా నడుస్తోంది. దాడిలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, సీఐ వెంకటరాజగౌడ్ ఉన్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయేదాక ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉంది.
వసతుల్లేకుండా మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు
ఆర్ఐపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆగ్రహం
పాపన్నపేట/రామాయంపేట, వెలుగు: పాపన్నపేటలో శుక్రవారం ఆపీసర్లు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆర్ఐ శ్రీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది వచ్చే కల్యాణలక్ష్మి ప్రోగ్రామ్‌లో సరైన వసతులు కల్పించలేదని అసహనం వ్యక్తం చేశారు. కోటి రుపాయలు పంపిణీ చేసే కార్యక్రమం ఇరుకైన గదిలో ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. సమావేశం గురించి ముందుగా సమాచారం ఉన్నప్పటికీ పాపన్నపేట తహసీల్దార్ డుమ్మా కొట్టడమేంటని ప్రశ్నించారు. ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత రామాయంపేట ఎంపీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మెదక్‌టౌన్, వెలుగు : కార్తీక మాసం సందర్భంగా మెదక్ పట్టణంలోని కోదండ రామాలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రైతుల సంక్షేమమే మోడీ ధ్యేయం
సిద్దిపేట రూరల్/మెదక్‌టౌన్/కోహెడ, వెలుగు: రైతుల సంక్షేమమే మోడీ ప్రభుత్వ ధ్యేయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల మేలు కోసం తెలంగాణలోని రామగుండంలో రూ.6500 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం చేసిన ఎరువుల కర్మా గారం జాతికి అంకితం చేయడం కోసం ప్రధాని మోడీ రావడం హర్షనీయమన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇంతవరకు రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. మెదక్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్‌లో రైతులు, ప్రజల సమక్షంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మోడీ పర్యటను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో చేతులు కలిపి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హవేలీఘనపూర్‌లో బీజేపీ నాయకుడు రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి వైపీఆర్ కాలేజీ వద్ద ఉన్న ఐకేపీ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.