రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు

రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు

న్యూఢిల్లీ: ఫోన్‌ హ్యాకింగ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ అన్నారు. ఫోన్ ట్యాగింగ్ లేదా హ్యాకింగ్ జరిగిందనడంలో ఎటువంటి బేస్ లేదని చెప్పారు. పెగాసస్‌ స్పైవేర్‌‌ ద్వారా తన ఫోన్‌ను కేంద్రం కచ్చితంగా ట్యాప్ చేసిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సుశీల్ కుమార్ మోడీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మాటలను ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. ‘పెగాసస్ ప్రాజెక్ట్‌’ పేరుతో రిపోర్ట్ పబ్లిష్ చేసిన సంస్థలే.. ఆ లిస్ట్‌లో ఉన్న వ్యక్తుల ఫోన్లు కచ్చితంగా ట్యాప్ అయ్యాయని చెప్పలేమని పేర్కొన్న విషయాన్ని సుశీల్ మోడీ ప్రస్తావించారు.


కాగా, శుక్రవారం ఢిల్లీలో పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన ఫోన్‌ను కేంద్రం కచ్చితంగా ట్యాప్ అయ్యిందని, అందులో అనుమానం అక్కర్లేదని కామెంట్ చేశారు. ‘‘ఇది కేవలం రాహుల్ గాంధీకి ప్రైవసీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా గళాన్ని వినిపిస్తాను. అంటే ఇది ప్రజల వాయిస్‌పై చేసిన అటాక్. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీపై సుప్రీం కోర్టు ఎంక్వైరీ చేయాలి’’ అని రాహల్ అన్నారు.