- యాంకర్ ఇన్వెస్ట్మెంట్లతో మాత్రమే డబ్బులు సేకరించండి
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఈక్విటీ షేర్ల ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్లలో పాల్గొనకూడదని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) స్పష్టం చేసింది. ఐపీఓకు ముందు యాంకర్ ఇన్వెస్టర్లుగా మాత్రమే అన్‌లిస్టెడ్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చని తెలిపింది. సాధారణ ప్రజల కోసం ఐపీఓ ప్రారంభించడానికి ఒక రోజు ముందు యాంకర్ కేటాయింపు ఉంటుంది.
ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లు లిస్టింగ్‌కు ముందు నెలల తరబడి జరుగుతాయి. ఎంఎఫ్ నిబంధనల ప్రకారం, మ్యూచువల్ ఫండ్‌లు లిస్ట్ కాబోయే షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సెబీ రూల్స్‌లో ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ల ప్రస్తావన లేనప్పటికీ, ఈ కేటాయింపులు లిస్టింగ్‌కు ముందు జరుగుతాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లు వాటిలో పాల్గొనవచ్చా ? లేదా ? అనే విషయమై గందరగోళం ఉంది.
ఈ విషయమై అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ)కు రాసిన లెటర్లో సెబీ వివరణ ఇచ్చింది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లలో ఎంఎఫ్ పాల్గొనడం రిస్క్‌తో కూడుకున్నదని, దీనివల్ల అన్‌లిస్టెడ్ షేర్లను కొనడానికి దారితీయవచ్చని పేర్కొంది. ఆఫర్ డాక్యుమెంట్ ఫైల్ చేసిన తర్వాతే ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లు జరిగినప్పటికీ, ఐపీఓ ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు.
దీంతో ఇన్వెస్టర్ల దగ్గర చాలా కాలంపాటు అన్‌లిస్టెడ్ షేర్లు ఉంటాయి. ప్రీ-ఐపీఓ రౌండ్లు ఫండ్ మేనేజర్లకు లాభదాయకం. సాధారణంగా ఐపీఓతో పోలిస్తే తగ్గింపు ధరకు షేర్లు దొరుకుతాయి. గత కొన్నేళ్లుగా ఇలాంటి డీల్స్తగ్గుతున్నాయి. ప్రీ-ఐపీఓ, ఐపీఓ ధరల మధ్య వాల్యుయేషన్ తేడా తగ్గడం ఇందుకు కారణం.
