తెలంగాణలో మూడు వారాలుగా ముఖం చాటేసిన వర్షాలు

తెలంగాణలో మూడు వారాలుగా ముఖం చాటేసిన వర్షాలు
  • రాష్ట్రంలో మూడు వారాలుగా ముఖం చాటేసిన వర్షాలు
  • కీలక దశలో వాడిపోతున్న పంటలు
  • కాపాడుకునేందుకు బోర్లపై ఆధారపడ్తున్న రైతులు 
  • కరెంట్ డిమాండ్​ పెరగడంతో అప్రకటిత కోతలు
  • వారం రోజుల్లో వర్షాలు పడకుంటే 20 లక్షల ఎకరాలపై ఎఫెక్ట్​​ 

మహబూబ్​నగర్​/నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో రెండు వారాలుగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. చాలా జిల్లాల్లో 20 రోజులుగా వాన జాడ లేకపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు  ఎండిపోతున్నాయి. బోర్లు, బావులు ఉన్న చోట్ల ఒకటి, రెండు తడులు పెట్టి కాపాడుకుంటున్నా కేవలం వర్షాధారంగా వేసిన పత్తి, మక్క, జొన్న, కంది లాంటి పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాగర్​కింద కాలువ నీళ్లు వస్తాయనే ఆశతో సాగుచేసిన వరి పొలాలు సైతం నెర్రెలు బారుతున్నాయి. వర్షాల్లేక రైతులంతా ఒకేసారి మోటర్లు ఆన్​చేస్తుండడంతో కరెంట్ డిమాండ్​పెరుగుతోంది. దీంతో పలు జిల్లాల్లో ట్రాన్స్​కో సిబ్బంది అప్రకటిత కోతలు అమలుచేస్తున్నారు.  రోజుకు14 గంటల నుంచి 8 గంటలు మాత్రమే ఇస్తుండడంతో చివరి మడులకు నీరందక పశువులకు వదిలేస్తున్నారు. 

కీలక నెలలో జాడలేని వానలు..

ఈ ఏడాది నైరుతి  రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. జూన్​లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావడంతో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. నిరుడు వానాకాలంలో కోటీ36లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి కోటీ 10లక్షలకే పరిమితమయ్యాయి. గతేడాది 50 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈసారి 45 లక్షల ఎకరాలకు, 65 లక్షల ఎకరాల్లో సాగైన వరి 49లక్షల ఎకరాలకు పడిపోయింది. మరో 5.15లక్షల ఎకరాల్లో మక్క, 4.57 లక్షల ఎకరాల్లో  కంది సాగైంది. జూలైలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఈమాత్రమైనా సాగువిస్తీర్ణం పెరిగింది.

కానీ ఆగస్టులో మళ్లీ  వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.  చాలా జిల్లాల్లో దాదాపు 20 రోజులుగా గట్టి వాన పడింది లేదు. ప్రస్తుతం పంటలన్నీ కీలక దశకు చేరుకున్నాయి.  వరి గంట పోసుకుంటుండగా,  పత్తి , కంది కొమ్మవేసే దశలో ఉంది. మక్క కూడా మూరెడు సైజు దాటింది. ఈ టైంలో తడులు అందితేనే పంటలు ఏపుగా పెరిగే చాన్స్​ ఉంటుంది. కానీ రెండు, మూడు వారాలుగా వాన జాడలేకపోవడంతో పంటల్లో ఎదుగుదల నిలిచిపోయింది.

బోర్లు, బావులు​ఉన్న చోట్ల రైతులు ఒకటి, రెండు తడులు అందిస్తున్నా, ఆ సౌలత్​లేని చోట పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి మెదక్​, కామారెడ్డి లాంటి జిల్లాల్లో వేల ఎకరాల్లో మక్క చేన్లు దెబ్బతింటున్నాయి. సిద్దిపేట జిల్లాలో తడులు అందక పత్తి, మక్క చేన్లు ఎదగడం లేదని రైతులు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్​నగర్​ జిల్లాల్లో పత్తి చేన్లు వడలిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కాలువ నీళ్లు వస్తాయనే ఆశతో సాగుచేసిన వరి చేన్లు నెర్రెలుబారుతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో మిర్చికి నీటి తడులు అందక తోటలు 
వడలిపోతున్నాయి. 

పలు జిల్లాల్లో కరెంట్​ కోతలు.. 

వర్షాలు లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులంతా బోర్లు, బావులపై ఆధారపడ్తున్నారు. ఒకేసారి మోటర్లు ఆన్​ చేస్తుండడంతో ఒత్తిడి పెరిగి తరుచూ ట్రాన్స్​ఫార్మర్ల ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. పలుచోట్ల ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో రోజూవారీ సగటు విద్యుత్​వినియోగం 4.83 మిలియన్ యూనిట్లు కాగా, ఈనెల 22న అత్యధికంగా 6.29 మిలియన్ యూనిట్లకు చేరింది.  సిద్దిపేట జిల్లాలో జూలైలో రోజుకు 7 మిలియన్ యూనిట్ల విద్యుత్​వినియోగించగా, ఈ నెల 10 మిలియన్ యూనిట్లకు పెరిగింది.

ఇలా జిల్లాల్లో విద్యుత్​ వాడకం పెరుగుతుండడంతో అప్రకటిత కోతలు అమలుచేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 18 గంటల పాటు త్రీఫేజ్​​ కరెంటు సప్లై చేయగా, డిమాండ్ పెరుగుతుండడంతో కొద్ది రోజులుగా తగ్గిస్తున్నారు.  రెండు, మూడు సార్లు ఫీడర్లకు బ్రేక్​ ఇవ్వడం వల్ల ఎనిమిది గంటల నుంచి 14 గంటలలోపే సప్లై అవుతోంది.  ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఎనిమిది గంటలు, మహబూబ్​నగర్​ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎనిమిది గంటలు

 మరికొన్ని చోట్ల 12 గంటలు,  పెద్దపల్లి జిల్లాలో 10 నుంచి 12 గంటలు, జగిత్యాల జిల్లాలో తొమ్మిది నుంచి 12 గంటలే త్రీఫేజ్​ కరెంట్​ ఇస్తున్నారు.  కరెంట్​ కోతలతో ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేనప్పటికీ సరిపడా గ్రౌండ్​ వాటర్ లేక బోర్లు పోయడం లేదని, దీంతో చివరి మడులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో  రానున్న వారం రోజుల్లో వర్షాలు పడకుంటే 10 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు చేతికి అందే పరిస్థితి ఉండదని వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సాగర్  నీళ్లిచ్చి  పంటలు కాపాడాలె

నాకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్న..  అంతా వరి పంటే వేసిన.  20 రోజులు అయితాంది వానలు పడ్తలేవు.  పంట నెర్రెలిచ్చి ఎండిపోతాంది. నాగార్జున సాగర్​ కెనాల్​ నీటిని వదిలి  పంటలను కాపాడాలె.

పైళ్ల విశ్వనాథం, రైతు, చండ్రుపట్ల, కల్లూరు మండలం, ఖమ్మం

పత్తి మొక్కలు వాడుతున్నయ్.. 

నిరుడు లాభాలు బాగున్నాయని  నాకున్న రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసిన.  మొదట్లో వానలు బాగానే  పడ్డయ్. ఇప్పుడు మూడు వారాలుగా వానల్లేవు.. నీటి తడులు అందక పత్తి మొక్కలు వాడుతున్నాయి. వానలు పడకుంటే దాదాపు రూ.లక్ష దాక నష్టం వస్తది.

నిరంజన్, కొండారెడ్డిపల్లి గ్రామం, నాగర్​కర్నూల్​ 

త్రీఫేజ్ ​ కరెంట్​  ఎప్పుడుంటదో తెల్వది

నాకున్న రెండు ఎకరాల్లో మక్కలు వేసిన.  దాదాపు రూ.70 వేలు పెట్టుబడి పెట్టిన.  వానల్లేక పంట ఎండుతున్నది. బోర్లు ఆన్​ చేసిన నీళ్లు పెడ్దామంటే త్రీఫేజ్​ కరెంటు ఉంటలేదు. పొద్దటి పూట త్రీఫేజ్​ కరెంటు సప్లై చేస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నరు.. కానీ కరెంటు ఎప్పుడు ఉంటదో, పోతదో తెలుస్తలేదు.

అంజి, రైతు, మిడ్జిల్, మహబూబ్​నగర్​ జిల్లా