473 గ్రామాలకు  బస్సు వస్తలే!

473 గ్రామాలకు  బస్సు వస్తలే!
  • 30 శాతం ఊర్ల ముఖం చూడని ‘పల్లె వెలుగు’
  • ప్రయాణికులను పొలిమేర కాడ్నే వదిలేస్తున్న బస్సులు
  • పరీక్షల టైంలో స్టూడెంట్ల పరేషాన్.. ప్రైవేట్‌‌ వెహికిల్సే దిక్కు

సంగారెడ్డి, వెలుగు: మెతుకుసీమ ప్రజలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్‌‌ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, వాటి హ్యాబిటేషన్స్‌కు బస్సులు వెళ్లడం లేదు. దీంతో స్టూడెంట్లు, ఉద్యోగులు, రైతులు ఆటోలు, జీపులు లాంటి ప్రైవేటు వెహికల్స్‌నే నమ్ముకోవాల్సి వస్తోంది. వీటిల్లో డ్రైవర్లు పరిమితికి మించి కూర్చోబెడుతుండడంతో గమ్యం చేరే వరకు గ్యారంటీ ఉండడం లేదు. కాగా, ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కనీసం ఏప్రిల్‌ 3న ప్రారంభం కానున్న టెన్త్‌ పరీక్షలు ముగిసే వరకైనా బస్సులు నడపాలని కోరుతున్నారు.

ఎనిమిది డిపోలు.. 643 బస్సులు

ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిపోల్లో 643 బస్సులు ఉన్నాయి.  సంగారెడ్డి డిపోలో (ఆర్టీసీ 66, హైర్ 23), జహీరాబాద్‌లో (ఆర్టీసీ 61, హైర్‌‌ 33), నారాయణఖేడ్‌లో (ఆర్టీసీ 47, ‌హైర్‌16 ), మెదక్‌లో ( ఆర్టీసీ 35, హైర్ 67 ) ,  నర్సాపూర్ డిపోలో (ఆర్టీసీ  26, హైర్‌‌ 5) బస్సులు నడుస్తున్నాయి.   సిద్దిపేటలో (ఆర్టీసీ 46, హైర్ 57), దుబ్బాకలో (ఆర్టీసీ 27, హైర్ 8), గజ్వేల్‌లో (ఆర్టీసీ 47, హైర్ 28) హుస్నాబాద్ డిపోలో (ఆర్టీసీ 30, హైర్ 21) బస్సులు నడుస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 1,602 గ్రామాలు

సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామాలు ఉండగా.. 245 గ్రామాల ముఖం కూడా చూడడం లేదు. మెదక్‌ జిల్లాలో 469  గ్రామలు  ఉండగా... 92 గ్రామాలకు, సిద్దిపేట జిల్లాలో  486 గ్రామాలు ఉండగా.. 136 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇందులోనూ 200పైగా గ్రామాలకు పూర్తిగా సర్వీస్‌ నిలిచిపోగా.. మిగతా గ్రామాలకు  డైరెక్ట్‌గా బస్సు వెళ్లం లేదు.  డ్రైవర్లు‌ పొలిమేర కాడనో,  పక్క గ్రామాల్లోనే ప్రయాణికులను దింపి వెళ్తున్నారు.  రైతులు కోసం నైట్ ఆల్ట్ బస్సులు ఉన్నా.. ఆర్టీసీ అధికారులు  పంపడం లేదు. స్కూళ్లకు హాలిడే ఉన్న రోజుల్లో  బస్సు బంద్ పెడుతున్నారు.  తండాలు పంచాయతీలుగా మారినా.. నేటికీ బస్సు సౌకర్యం కల్పించడం లేదు. 

బస్సుల కోసం ధర్నాలు

జహీరాబాద్, నారాయణఖేడ్, హత్నూర, అందోల్, సదాశివపేట, న్యాల్‌కల్, మనూర్, మొగుడంపల్లి, పుల్కల్ తదితర మండలాల్లో బస్సుల సమస్య అధికంగా ఉంటోంది. దీంతో స్టూడెంట్లు స్కూల్ టైమ్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ పేరెంట్స్‌తో కలిసి ధర్నాలు చేస్తున్నారు.  కంది, కల్హేర్, మొగుడంపల్లి, మునిపల్లి మండల కేంద్రాల్లో ఇప్పటికే అనేకసార్లు రాస్తారోకోలు చేయడమే కాదు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో గొడవలు కూడా పెట్టుకున్నారు. స్థానిక లీడర్లు జోక్యం చేసుకొని టైమ్‌కు బస్సులు నడిపిస్తామని హామీలు ఇచ్చినా.. ఒకటి రెండు రోజులకే పరిమితమయ్యాయి.