
బస్తర్: మావోయిస్టులతో ప్రభుత్వం ఇకపై ఎలాంటి చర్చలు జరపబోదని, వారు లొంగిపోవాల్సిందే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ తమ ఆయుధాలను వదిలేసి లొంగిపోతే స్వాగతిస్తామన్నారు. శనివారం (అక్టోబర్ 04) చత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇండియా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని మరోసారి ప్రకటించారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు కోరుతున్నారని, కానీ ఇప్పుడు వారితో చర్చించడానికి ఏమీలేదన్నారు.
చత్తీస్ గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. శాంతికి విఘాతం కలిగించేవారికి బలగాలు తగిన జవాబిస్తాయని హెచ్చరించారు.