ఈ దేశపు మట్టిని కూడా అమ్మేస్తారా?

ఈ దేశపు మట్టిని కూడా అమ్మేస్తారా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీకి ప్రజలపై ప్రేమ లేదని, దేశాన్ని అమ్మేస్తోందని ఆమె అన్నారు. విద్యార్థులు, టీచర్లు, ప్రభుత్య ఉద్యోగులను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు మమత బెనర్జీ. ఎన్నికల తర్వాత బెంగాల్లో జరిగిన హింసలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు, 15 మంది TMC కార్యకర్తలు చనిపోయారన్నారు. పోస్ట్ పోల్ వయోలెన్స్ పై ఏ దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించినా తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ.. వాళ్లు బీజేపీ నేతలను వెంట తీసుకుని విచారణకు వెళ్లడమే ఆందోళన కలిగిస్తోందన్నారు. తృణమూల్ విద్యార్థి పరిషత్ ఫౌండేషన్ డే వేడుకల్లో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలు, ఎయిర్‌‌పోర్టులు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తోందని మమత అన్నారు. ఈ దేశపు మట్టిని కూడా మీరు అమేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు.

మరోవైపు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి బెంగాల్ ప్రభుత్వ బొగ్గు గనుల స్కామ్‌ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపైనా మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీకి ధైర్యం ఉండే తమను రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాలు విసిరారు. తనకు గుజరాత్ చరిత్ర తెలుసని, బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తెలుసని మమత చెప్పారు. తమపై ఈడీని ఎందుకు ఉసిగొల్పారో చెప్పాలని అన్నారు. బొగ్గు గనుల వ్యవహారంలో తృణమూల్ వైపు వేళ్లు చూపించే ముందు బీజేపీ సంగతి చూసుకోవాలన్నారు. బొగ్గు శాఖ కేంద్రం పరిధిలోనే ఉంటుందని, బెంగాల్‌లోని కోల్‌ బెల్ట్‌ను లూటీ చేసిన బీజేపీ నేతలు, ఆ శాఖ కేంద్ర మంత్రి సంగతేంటని ఆమె ప్రశ్నించారు.