బీఆర్ఎస్, బీజేపీకి విలువల్లేవు

బీఆర్ఎస్, బీజేపీకి విలువల్లేవు
  • కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని తట్టుకోలేకపోతున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ, బీఆర్ఎస్‌లు తిలోదకాలు ఇచ్చేశాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జూన్‌లో సీఎం మారుతారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడాన్ని ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, ఆ పార్టీలకు విలువలు లేవని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాయన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిస్తే పీఠం ఎక్కడం, ఓడిపోతే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం పార్టీల విధి. కానీ, బీజేపీ మూడో మార్గాన్ని ఎంచుకుంది. కుట్రపూరితంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో పార్టీలను ఏమార్చి తన పబ్బం గడుపుకుంటున్నది. కానీ, తెలంగాణలో అలాంటి పప్పులు ఉడకవు’’ అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారం కొల్పోయాక బీఆర్ఎస్  దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. 

కాంగ్రెస్  పార్టీ అధికార పీఠం ఎక్కిన రెండో రోజు నుంచే ఆ పార్టీ నేతలు విషం చిమ్మడం ప్రారంభించారని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్  నేతలది అధికార దాహమని, ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వం చేజారిన తరవాత ఒక్కక్షణం కూడా ఆగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన పాపం గత ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్  సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అనుసరిస్తోందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.