
- మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, సిమన్ సకగుచీని వరించిన పురస్కారం
- అమెరికా, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అవార్డు
- హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రయోగాలకు గుర్తింపు
- ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌ను నివారించడంలో కీలక పాత్ర
స్టాక్‌హోమ్: మానవ రోగ నిరోధక వ్యవస్థ గుట్టు విప్పినందుకుగానూ 2025వ సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. అమెరికాకు చెందిన మేరీ ఇ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన సిమన్ సకగుచీని అవార్డుకు నోబెల్ కమిటీ ఎంపిక చేసింది.
ఈమేరకు సోమవారం స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నోబెల్ బృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘పెరిపెరల్ ఇమ్యూన్టోలరెన్స్’పై పరిశోధనలకుగానూ ఈ ముగ్గురిని నోబెల్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. పురస్కారానికి ఎంపికైన మేరీ ఇ. బ్రంకోవ్ (64) సీటెల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. ఫ్రెడ్ రామ్స్‌డెల్ (64) శాన్‌ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్స్‌కు సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్నారు.
సిమన్ సకగుచీ (74) జపాన్‌లోని ఒసాకా వర్సిటీలో ఇమ్యునాలజీ ఫ్రాంటియర్ రీసెర్చ్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ ముగ్గురూ అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల (దాదాపు రూ.10.40 కోట్ల)ను పంచుకోనున్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం.. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నది.
వీరి ఆవిష్కరణ ఇదే..
మానవ శరీరానికి ఇమ్యూన్ సిస్టమ్ బాడీగార్డ్‌లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌లు, క్యాన్సర్ కణాల వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. అయితే, ఈ ఇమ్యూన్ సిస్టమ్‌ను నియంత్రించడం తప్పనిసరి. లేకుంటే ఇది సొంత అవయవాలపైనే దాడి చేస్తాయి. ఫలితంగా ఆటో ఇమ్యూన్ డీసీజెస్ వస్తాయి. దీన్ని నిరోధించే ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్’పై పరిశోధన చేసిన మేరీ ఇ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకగుచీ.. ఇమ్యూన్‌సెల్స్ సొంత శరీరంపైదాడి చేయకుండా అడ్డుకునే ‘రెగ్యులేటరీ టీ సెల్స్’ను వీరు కనుగొన్నారు.
సకగుచీ 1995లో ఒక కొత్త రకం టీ- సెల్‌ను గుర్తించారు. దీనిని ఇప్పుడు రెగ్యులేటరీ టీ-సెల్స్ లేదా టీ -రెగ్స్ అని పిలుస్తున్నారు. ఈ టీ-రెగ్స్ రోగనిరోధక వ్యవస్థను అతిగా పనిచేయకుండా నియంత్రించడంలో సహాయపడతాయి. 2001లో బ్రంకో, రామ్స్‌డెల్.. ‘ఫాక్స్ పీ 3’ అనే జన్యువులో ఒక మ్యుటేషన్‌ను కనుగొన్నారు. ఇది మానవుల్లో అరుదైన ఆటోఇమ్యూన్ డిసీజ్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నోబెల్ కమిటీ ప్రకారం, రెండేండ్ల తర్వాత 2003లో సకగుచి ఈ ఆవిష్కరణలను అనుసంధానించి ఫాక్స్‌పీ3 జీన్.. రెగ్యులేటరీ టీ- సెల్స్ (టీ -రెగ్స్) అభివృద్ధిని నియంత్రిస్తుందని చూపించారు.
‘‘రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అందరికీ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎందుకు రావో అర్థం చేసుకునేందుకు వారి ఆవిష్కరణలు దోహదపడతాయి’’ అని నోబెల్ కమిటీ చైర్మన్ ఓలె కాంపే తెలిపారు. వీరి ఆవిష్కరణ ఫలితంగా క్యాన్సర్‌తోపాటు మధుమేహం, కీళ్లవాపులాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశం లభించింది. ఆర్గాన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినప్పుడు శరీరం కొత్త అవయవాలను తిరస్కరించకుండా ఉండేలా చేసేందుకు సాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఇప్పుడు రెగ్యులేటరీ టీ సెల్స్‌ను ఉపయోగించి ఆటో ఇమ్యూన్ డీసీజెస్, క్యాన్సర్‌కు చికిత్సలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించారు.