కేయూ స్టూడెంట్లపై నాన్ బోర్డర్స్ దాడి!..ఇద్దరిపై కేసు నమోదు

కేయూ స్టూడెంట్లపై నాన్ బోర్డర్స్ దాడి!..ఇద్దరిపై కేసు నమోదు

హనుమకొండ, హసన్ పర్తి, వెలుగు: కాకతీయ వర్సిటీలో ఇద్దరు స్టూడెంట్లపై నాన్ బోర్డర్స్ దాడికి పాల్పడ్డారు. దీంతో బయటి వ్యక్తులు తమపై దాడి చేశారంటూ స్టూడెంట్స్ శనివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 

బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. కేయూ క్యాంపస్ లో దివ్యాంగుడైన కొట్టూరి గజానంద్, వనం పవన్ కల్యాణ్ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరూ భోజనం చేసేందుకు బైక్ పై మెస్ కు వెళ్తుండగా.. ఓ విద్యార్థి సంఘానికి చెందిన ప్రశాంత్, ఎస్డీఎల్సీఈలో ఎంబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి అఖిల్ అడ్డగించి తిడుతూ దాడికి దిగారు. దీంతో గజానంద్, పవన్ కళ్యాణ్ తమ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి చెప్పగా అక్కడకు వెళ్లారు. అనంతరం ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది.  

సమాచారం అందడంతో కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి, కేయూ, సుబేదారి సీఐలు రవికుమార్, రంజిత్, పోలీస్ సిబ్బంది వెళ్లారు. బాధిత విద్యార్థులు దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళన విరమించేంది లేదని స్పష్టంచేశారు. దీంతో క్యాంపస్ లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అనంతరం ఏసీపీ ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కొట్టూరి గజానంద్, వనం పవన్ కల్యాణ్ కేయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ప్రశాంత్, అఖిల్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.