మైనార్టీ విద్యాసంస్థల్లో నాన్ మైనార్టీలే ఎక్కువ

మైనార్టీ విద్యాసంస్థల్లో నాన్ మైనార్టీలే ఎక్కువ

దేశంలో మైనార్టీ విద్యా సంస్థలు విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ యాక్ట్) పరిధిలోకి రాకుండా తప్పించుకొంటూ భారీగా విద్యా వ్యాపారం చేస్తున్నాయని జాతీయ బాలల హక్కుల కమిషన్(ఎన్‌‌‌‌‌‌‌‌సీపీసీఆర్) అధ్యయనం తేల్చింది. మైనార్టీ స్కూళ్లలో నాన్​ మైనార్టీ విద్యార్థులు ఎక్కువ శాతం చదువుతున్నారని వెల్లడించింది. ఈ విద్యా సంస్థల్లో మూడింట రెండు వంతుల మంది ఇతరులే చదువుతున్నారని కమిషన్​ నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా మైనార్టీ స్కూళ్లపై అధ్యయనం చేసిన కమిషన్..​ దేశంలోని మదర్సాలతో పాటు అన్ని మైనార్టీ స్కూళ్లను విద్యా హక్కు చట్టం, సర్వశిక్షా అభియాన్ ప్రోగ్రాం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మైనార్టీ పాఠశాలల్లో మైనార్టీ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కల్పించాలని కూడా సూచించింది. వాస్తవానికి 2006లో చేసిన రాజ్యాంగ సవరణ తర్వాత మైనార్టీ స్టేటస్ సర్టిఫికెట్ పొందే స్కూళ్ల సంఖ్య పెరిగింది. 2005--–09 మధ్య మొత్తం స్కూళ్లలో 85 శాతం కంటే ఎక్కువ స్కూళ్లు మైనార్టీ సర్టిఫికెట్ పొందాయి. 2009లో వచ్చిన ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 12 (1) (సి), 18 (3) ప్రకారం అన్‌‌‌‌‌‌‌‌-ఎయిడెడ్ మైనార్టీ స్కూళ్లకు వర్తించదు. 2014లో వచ్చిన ప్రమతి తీర్పు మైనార్టీ స్కూళ్లకు మొత్తంగా ఆర్టీఈ చట్టం వర్తించకుండా చేసింది.
62.50 శాతం మంది నాన్​ మైనార్టీలే..
‘‘మైనార్టీ వర్గాల విద్యపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఎ, ఆర్టికల్ 15(5) ప్రకారం మినహాయింపుల ప్రభావం” అనే అంశంపై ఎన్‌‌‌‌‌‌‌‌సీపీసీఆర్ ఈ సర్వే చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30, సాంస్కృతిక, భాషా, మతపరమైన రక్షణ కోసం మైనార్టీలకు తమ సొంత సంస్థలను తెరిచే హక్కును కల్పిస్తోంది. ఆర్టికల్ 21(ఎ) విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా కాపాడుతుంది. అలాగే, విద్యా హక్కు చట్టం నుంచి మైనార్టీ విద్యా సంస్థలకు మినహాయింపు కలిగిస్తున్న 93వ రాజ్యాంగ సవరణ, మైనార్టీ వర్గాల పిల్లలను ఎలా ప్రభావితం చేస్తోందో, ఎంత అంతరం కలిగిస్తున్నదో అంచనా వేయడమే ఈ స్టడీ లక్ష్యమని ఎన్‌‌‌‌‌‌‌‌సీపీసీఆర్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ ప్రియాంక్ కనూంగో చెప్పారు. ‘‘మేం మైనార్టీ సంస్థలు, ప్రత్యేకంగా మదర్సాలను చూశాం. క్రిస్టియన్​ మిషనరీ స్కూళ్లను పరిశీలించాం. వీటిలో చదువుతున్న 74 శాతం మంది విద్యార్థులు మైనార్టీ కమ్యూనిటీకి చెందినవారు కాదనే ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చాలా స్కూళ్లు, మైనార్టీ సంస్థలుగా నమోదు చేసుకున్నాయి. అలా చేస్తే ఆర్టీఈ చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదు. మైనార్టీ విద్యా సంస్థలకు ఆర్టీఈ కింద మినహాయింపులపై సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ మినహాయింపు వల్ల పేద మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. అందువల్ల మదర్సాలతో పాటు అన్ని మైనార్టీ విద్యా సంస్థల్లోనూ విద్యా హక్కు చట్టం, సర్వశిక్షా అభియాన్ విస్తరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం’’ అని ఆమె చెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌సీపీసీఆర్ నివేదిక ప్రకారం, క్రిస్టియన్​ మిషనరీ స్కూళ్లలో 74 శాతం మంది స్టూడెంట్లు నాన్​ మైనార్టీ వర్గాలకు చెందినవారే. మొత్తం మీద, అటువంటి స్కూళ్లలో 62.50 శాతం మంది మైనార్టీయేతర వర్గాలకు చెందినవారు చదువుతున్నారు. మైనార్టీ స్కూళ్లలో 8.76 శాతం మంది విద్యార్థులు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యానికి చెందినవారు. అలాగే దేశంలో బడిబయట ఉన్న 1.1 శాతం మంది బడిఈడు పిల్లల్లో అత్యధికం ముస్లిం వర్గాలకు చెందినవారే అని ఈ నివేదిక పేర్కొంది. 
జనాభా ‘దామాషా’ను మించి మైనార్టీ సంస్థలు
మతాల వారీగా స్కూళ్లను చూస్తే, దేశంలోని మైనార్టీ జనాభాలో క్రైస్తవులు 11.54 శాతం మంది ఉండగా, వారు 71.96 శాతం స్కూళ్లను నిర్వహిస్తున్నారు. 69.18 శాతం మైనార్టీ జనాభా ఉన్న ముస్లింలు 22.75 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. సిక్కులు మైనార్టీ జనాభాలో 9.78 శాతం.. కానీ వీరు 1.54 శాతం పాఠశాలలనే నిర్వహిస్తున్నారు. 3.83 శాతం మైనార్టీ జనాభా ఉన్న బౌద్ధులు 0.48 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. 1.9 శాతం మైనార్టీ జనాభా కలిగిన జైనులు 1.56 శాతం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌సీపీసీఆర్ నివేదిక ప్రకారం, దేశంలో మూడు రకాల మదరసాలు ఉన్నాయి. 1. గుర్తింపు పొందిన మదర్సాలు. ఇవి మతపరమైన, లౌకిక విద్యను అందిస్తాయి. 2. గుర్తింపబడని మదర్సాలు. లౌకిక విద్య అందించకపోవడం లేదా మౌలిక సదుపాయాల లేమి వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేయనివి. 3. మ్యాప్ చేయని మదరసాలు. ఇవి నమోదు కావడానికి ఎన్నడూ దరఖాస్తు చేయలేదు. ముస్లిం పిల్లలు 4 శాతం(15.3 లక్షల మంది) మదర్సాలకు హాజరవుతారని చెప్పే సచార్ కమిటీ నివేదిక, గుర్తింపు పొందిన మదర్సాలనే పరిగణనలోకి తీసుకుంది. శతాబ్దాలుగా ఈ మదర్సాల సిలబస్ ఏకరీతిగా లేదు. వీటిలోని ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు కూడా లేవు.
క్రైస్తవ విద్యా సంస్థలకు రూ.2,500 కోట్లు ఆదా
అన్ని అన్-ఎయిడెడ్  స్కూళ్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ప్రవేశం కల్పించాలని విద్యా హక్కు చట్టం చెప్తోంది. 2017–-18లో ప్రైవేటు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సాధారణ కోర్సులు చదివేందుకు ఒక్కో విద్యార్థి చేసిన ఖర్చు రూ.18,267. దేశవ్యాప్తంగా 13 వేల క్రైస్తవ మైనార్టీ స్కూళ్లు ఉండగా, వీటిలో 54,86,884 మంది చదువుతున్నారు. వీరి నుంచి ఏటా రూ.10,022.89 కోట్లను ఈ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టం నుంచి మినహాయింపు ఫలితంగా క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలలు రూ.2,505.72 కోట్ల మేరకు ఆదా చేసుకుంటున్నాయి. అలాగే క్రైస్తవ స్కూళ్లలో చదివే వారిలో 74.01 శాతం మంది క్రైస్తవులు కారు. కొన్ని రాష్ట్రాల్లో వీరి సంఖ్య 80 శాతం వరకు ఉంది. పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌లోని మైనార్టీ జనాభాలో 92.47% ముస్లింలు, 2.47% మంది క్రైస్తవులు కాగా, 114 క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ స్కూళ్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఇక, ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో క్రైస్తవ జనాభా 1% కంటే తక్కువగా ఉన్నా, ఆ రాష్ట్రంలో 197 క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లు ఉన్నాయి. ఈ అసమాన సంఖ్య మైనార్టీ విద్యా సంస్థలను స్థాపించే ప్రధాన లక్ష్యాన్ని దెబ్బ తీస్తోంది. అందువల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా మార్పులు చేయాలి. ఇందుకోసం కేంద్రం నిర్దిష్ట మార్గదర్శకాలను నిర్దేశించాల్సిన అవసరం ఉంది.

పేరుకు మైనార్టీ విద్యా సంస్థలైనా వాటిలో చదివే స్టూడెంట్లలో ఎక్కువ మంది నాన్​ మైనార్టీలే ఉంటున్నారు. ఈ విద్యా సంస్థల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య 10 శాతం కూడా దాటడం లేదు. కానీ, ఫీజులు, డొనేషన్ల పేరుతో నాన్​ మైనార్టీలను ఎక్కువగా చేర్చుకుంటూ ఇష్టానుసారంగా విద్యా వ్యాపారం చేస్తున్నాయి. దేశంలో మైనార్టీ జనాభాను మించి మైనార్టీ విద్యా సంస్థలు ఉండటమే వాటి విద్యా వ్యాపారాన్ని వెల్లడిస్తోంది. పైగా, ఆర్టీఈ యాక్ట్​ పరిధిలోకి రాకపోవడంతో మైనార్టీల్లో పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య అందించకుండా తప్పించుకొంటూ సంపన్న వర్గాలకు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. అందువల్ల మైనార్టీ విద్యా సంస్థల్లో ఆయా కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకే మెజారిటీ ప్రవేశాలు దక్కేలా మార్పులు చేయాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలి.
                                                                                                                                                  డా. టి.ఇంద్రసేనారెడ్డి,సోషల్​ ఎనలిస్ట్