
బాలీవుడ్ నోరా ఫతేహికి బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. రాజధాని ఢాకాలో నోరా ఫతేహి డ్యాన్స్ ప్రదర్శనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం.. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. విదేశీ మారక నిల్వలను కొనసాగించే లక్ష్యంతో ఫతేహికి అనుమతి రద్దు చేసింది. మహిళా లీడర్‌షిప్ కార్పొరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫతేహి డ్యాన్స్ ప్రదర్శన చేసి అవార్డులను అందజేయాల్సి ఉంది.
క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వల మధ్య డాలర్ చెల్లింపులపై సెంట్రల్ బ్యాంక్ విధించిన ఆంక్షలను మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో నోరాకు అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఢాకాలోని బాలీవుడ్ అభిమానులకు షాక్ తగిలినట్లైంది. ఇక మొరాకో-కెనడియన్ కుటుంబం నుండి వచ్చిన ఫతేహి 2014లో హిందీ చిత్రాలలో అడుగుపెట్టింది. నోరా ఫతేహి ఖతార్‌లో జరిగే FIFA ప్రపంచ కప్ 2022లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.