నియంత కిమ్ ఏడ్చిండు.. నార్త్​ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన

నియంత కిమ్ ఏడ్చిండు.. నార్త్​ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన
  • మరింత మంది పిల్లలను కనాలంటూ మహిళలకు సూచన
  • సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో

ప్యాంగ్యాంగ్: కరుడుగట్టిన నియంతగా పేరొందిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్ కంటతడి పెట్టారు. నిండు సభలో, చుట్టూ ఉన్న జనం ముందే కన్నీళ్లు కార్చారు. తమ సుప్రీం లీడర్ కళ్లల్లో నీరు చూసి అక్కడున్న మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. దేశంలోని మహిళల (చిన్నారుల తల్లుల) తో కిందటి ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టిష్యూ పేపర్​తో కిమ్​కళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. చిన్న చిన్న తప్పులకే మరణశిక్ష వేసి నిర్ధాక్షిణ్యంగా అమలు చేయించే కిమ్ ఎందుకు ఏడ్చారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే..

ఇటీవలి కాలంలో నార్త్ కొరియాలో జననాల రేటు పడిపోయింది. దీంతో జనాభా తగ్గిపోతుందని దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై చర్చించేందుకు కిమ్​ ఓ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కిమ్​ హాజరైనప్పటికీ ఆయన ప్రసంగాన్ని మరొక లీడర్ చదివారు. ఆ సమయంలో పలుమార్లు కిమ్​ కళ్లు తుడుచుకోవడం వీడియోలో కనిపించింది. కార్యక్రమానికి హాజరైన మహిళలు కూడా కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా దేశాన్ని బలోపేతం చేసేందుకు తమ వంతుగా పాటుపడుతున్న మహిళలకు కిమ్​ ధన్యవాదాలు తెలిపారు. జనాభాను పెంచడానికి మరింత మంది పిల్లలను కనాలంటూ దేశంలోని మహిళలకు​ పిలుపునిచ్చారు. యూఎన్ గణాంకాల ప్రకారం నార్త్ కొరియాలో సగటున ఒక్కో మహిళ 1.8 మంది చిన్నారులకు జన్మనిస్తోంది. కాగా, కరోనా తర్వాత దేశంలో చాలా కుటుంబాలకు కనీస అవసరాలే తీరడంలేదు. ఈ పరిస్థితుల్లో మరింత మంది పిల్లలను కనాలంటూ సుప్రీం లీడర్ కిమ్​ పిలుపునివ్వడం విశేషం.