క్షిపణి పరీక్షల్లో తగ్గేది లేదంటున్న ఉత్తరకొరియా

క్షిపణి పరీక్షల్లో తగ్గేది లేదంటున్న ఉత్తరకొరియా

క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా మరోసారి దూకుడు ప్రదర్శించింది. ఆదివారం (జూన్ 5న) 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మరుసటి రోజే ఈ ప్రయోగాలను ఉత్తర కొరియా సైన్యం చేపట్టింది. 2022 మొదటి నుంచే కిమ్ ప్రభుత్వం క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసింది. 2017 తర్వాత మొదటిసారి పరీక్షించిన పుల్ రేంజ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సహా ఇప్పటి వరకూ 17 పరీక్షలు నిర్వహించింది. 

రాజధాని ప్యాంగ్యాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి ఉత్తర కొరియా సైన్యం 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. వాటిని జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తం చేశామన్నారు. అమెరికా, దక్షిణ కొరియాలు కలిసి ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు జపాన్ కూడా కిమ్ దూకుడుపై ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ప్రయోగాల గురించి వీలైనంత సమాచారాన్ని సేకరించాలని ప్రధాని ఫ్యుమియో కిషిదా తమ అధికారులను ఆదేశించారు. విమానాలు, నౌకలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలన్నారు. 

ఇటీవల అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైనికులతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ కూడా పాల్గొంది. 2017 తర్వాత విన్యాసాల్లో ఓ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించిందని తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. వాటిని తమపై దాడుల కోసమే చేపడుతున్న రిహార్సల్స్ గా అనుమానిస్తోంది. అమెరికాకు హెచ్చరికగానే 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా అణు పరీక్షలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం..

విరాటపర్వం ట్రైలర్ అదుర్స్

ఆయన చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు