ఆరోపణలు కాదు.. ఆధారాలుంటే బయటపెట్టాలి : మహేశ్వర్ రెడ్డి కి ఐకే రెడ్డి సవాల్

ఆరోపణలు కాదు.. ఆధారాలుంటే బయటపెట్టాలి : మహేశ్వర్ రెడ్డి కి ఐకే రెడ్డి సవాల్
  •     అసత్య ప్రచారం చేస్తున్నందుకే కేసు
  •     బీఆర్ఎస్ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

లక్ష్మణచాంద (మామడ), వెలుగు: మున్సిపల్ ఉద్యోగాల నియామకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. మామడ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనపై అసత్య ప్రచారం చేస్తున్నందుకే పోలీసులు మహేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేశారని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. కాంగ్రెస్​లో మహేశ్వర్​ రెడ్డి పని అయిపోయిందని, రేపోమాపో పార్టీ మారతాడని అన్నారు. 

అధిక ధరలతో భారం..

 కేంద్రం నిత్యం పెంచుతున్న ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు బీఆర్​ఎస్​ కృషి చేస్తుంటే.. నరేంద్రమోడీ ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్యులపై భారాన్ని పెంచుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా వంటగ్యాస్​ ధరలు పెంచుతోందని , గ్యాస్ స్టవ్ వెలిగించలేని పరిస్థితి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.

రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వరి సాగు రెట్టింపు అయిందని, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు నెలనెలా పింఛన్​ పొందుతున్నారని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేసి, పార్టీని మరింత  బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గంగాధర్ గౌడ్ , నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి రాంకిషన్ రెడ్డి, భూషణ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ,మామడ మండల్ ఎంపీపీ అమృత జైసింగ్, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.