అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కొన్ని వింతలు, విచిత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని కళ్లను మాయ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్‌లు చేయాలంటే గ్రాఫిక్స్ వల్లే అవుతుంది. రియల్ లైఫ్‌లో అలాంటివి జరగవు అనుకుంటాం. కానీ, కొన్ని చూసినప్పుడు నిజమని నమ్మక తప్పదు. ఎందుకంటే వాటిలో మాయ కాదు, సైన్స్ ఉంటుంది కాబట్టి. అలాంటిదే ఈ వీడియో.
మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనడానికి నిదర్శనం ఇది. అంతఃపురం సినిమాలో ‘అసలేం గుర్తుకు రాదు..’ అనే పాటలో నటి సౌందర్య చీర రంగు మారినట్లు, ఈ వీడియోలో ఒక అమ్మాయి డ్రెస్ రంగు కూడా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఇజ్జి పూపి అనే అమ్మాయి లేటెస్ట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది.
అందులో ఆమె తెలుపు రంగు గౌన్ వేసుకుని ఉంది. ఆమె ఇంట్లో నుంచి బయటకొచ్చి ఎండలో నిలబడింది. అంతే... వైట్ కలర్ కాస్తా పింక్ కలర్లోకి మారిపోయింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాకయ్యారు. కొద్దిసేపట్లోనే ఆ వీడియో వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ లైకులు, కామెంట్లతో ట్రెండింగ్‌గా మారింది. అయితే, వీడియో కింద రాసిన దాన్ని బట్టి దానికి కారణం.. అది పీహెచ్5 బ్రాండ్ డ్రెస్. ఆ కంపెనీ డిజైన్ చేసిన వాటిలో ఇదొక కొత్త రకం వెరైటీ. ఆ డ్రెస్‌లు యూవీ కిరణాలు పడగానే రియాక్ట్ అయి ఇలా రంగు మారతాయట.