
- నేను క్లీన్ చిట్‌తో బయటకొస్తే సంజయ్ చెప్పుతో కొట్టుకుంటడా?
- కరీంనగర్‌కు ఆయన ఏం చేసిండని ఫైర్
రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: డ్రగ్ టెస్టుకు తాను సిద్ధమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రక్తంతో పాటు అవసరమైతే తన బొచ్చు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానని చెప్పారు. మంగళవారం సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘‘బండి సంజయ్ నన్ను అడుగుతుండు కదా.. డ్రగ్ టెస్టుకు నేను సిద్ధం. నా రక్తం తీస్తారా? చర్మం తీస్తారా? నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. ఏ డాక్టర్నన్న తెచ్చుకొమ్మను. ఇక్కడే ఉంటా.. నేను క్లీన్ చిట్ తో బయటకు వచ్చినంకా కరీంనగర్ కమాన్ కాడ సంజయ్ చెప్పు దెబ్బలు తింటడా? నా చెప్పుతో కాదు.. ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటడా?” అని సవాల్ విసిరారు. కరీంనగర్, సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు పైసలు తేలేనోడు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘‘వేట కుక్కల్లాంటి కొన్ని సంస్థలను ఉసిగొల్పితే భయపడేది లేదు. ఈడీ, మోడీ, బోడీ ఏం చేసుకుంటారో చేసుకోని’’ అని అన్నారు. ‘‘టీఆర్ఎస్ పేరు మాత్రమే మారింది. డీఎన్ఏ మారలేదు. తెలంగాణలో జరిగిన డెవలప్ మెంట్ దేశమంతా జరగాలని బీఆర్ఎస్ గా మారాం. హైదరాబాద్ కేంద్రంగా దేశంలో రాజకీయాలు చేస్తాం. బీఆర్ఎస్ తో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాం. రైతులను ఆర్థికంగా బలవంతులను చేస్తాం. గుజరాత్‌కు చెందిన ఓ నలుగురు దేశంలో చక్రం తిప్పుతుంటే, మన తెలంగాణ సాధించిన కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ప్రతిపక్షాలకు వచ్చిన నొప్పెంటి?” అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
కరీంనగర్‌కు ఏం చేసినవ్?
సంజయ్కరీంనగర్కు ఏం చేసిండో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ‘చిల్లర రాజకీయాలు చేసుడు.. అడ్డదిడ్డంగా మాట్లాడుడు కాదు.. కరీంనగర్ ప్రజల కోసం ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి. చేతనైతే మోడీ దగ్గరకు పోయి నిధులు తేవాలి. పార్లమెంట్ జరుగుతుంటే బయట తిరుగుడు కాదు.. పార్లమెంట్‌కు హాజరై మోడీని ఒప్పించి రాష్ట్రానికి ఫండ్స్ తేవాలి” అని అన్నారు. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ, వేములవాడ టెంపుల్‌కు రూ.500 కోట్లు, జమ్మికుంటలోని కమలాపూర్‌లో హ్యాండ్లూమ్ క్లస్టర్, తీగల గుట్టపల్లి కాడ ఆర్వోబీ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. భైంసాను దత్తత తీసుకుంటానని మాటలు చెప్పుడు కాదు.. ముందు కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలన్నారు.
దమ్ముంటే వేములవాడకు 100 కోట్లు తీసుకురా..
పొద్దున లేచిన దగ్గరి నుంచి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనను తిడితే ఓట్లు రావని కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన వేములవాడలో రూ.72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, రుద్రంగిలో కేజీబీవీ స్కూల్‌ను ప్రారంభించారు. సంజయ్‌కి దమ్ముంటే వేములవాడ గుడికి కేంద్రం నుంచి రూ.100 కోట్లు తేవాలని సవాల్ విసిరారు. వేములవాడకు మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ తేవాలన్నారు. తన తండ్రి కేసీఆర్ పెండ్లి రాజన్న ఆలయంలో జరిగిందని, ఈ గుడిని అభివృద్ధి చేసేది కూడా తామేనన్నారు. వేములవాడను ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు.
బండి సంజయ్ నన్ను అడుగుతుండు కదా.. డ్రగ్ టెస్టుకు నేను సిద్ధం. నా రక్తం తీస్తారా? చర్మం తీస్తారా? నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. ఏ డాక్టర్నన్న తెచ్చుకొమ్మను. ఇక్కడే ఉంటా.. నేను క్లీన్ చిట్ తో బయటకు వచ్చినంకా కరీంనగర్ కమాన్ కాడ సంజయ్ చెప్పు దెబ్బలు తింటడా? నా చెప్పుతో కాదు.. ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటడా?. వేట కుక్కల్లాంటి కొన్ని సంస్థలను ఉసిగొల్పితే భయపడేది లేదు.
- మంత్రి కేటీఆర్