ఓటుకు నోట్లు.. క్యాష్​తో పాటు లిక్కర్​, స్వీట్​ బాక్సులు, గిఫ్టులు

ఓటుకు నోట్లు.. క్యాష్​తో పాటు లిక్కర్​, స్వీట్​ బాక్సులు, గిఫ్టులు
  • క్యాష్​తో పాటు లిక్కర్​, స్వీట్​ బాక్సులు, గిఫ్టులు
  • నూనె కార్టన్​లలో నోట్ల కట్టలు
  •  పలుచోట్ల  నేతల ఫిర్యాదులతో  రంగంలోకి పోలీసులు
  • క్యాష్, లిక్కర్​ పంపిణీని  అడ్డుకోవడంతో గొడవలు

వెలుగు, నెట్​వర్క్​: పోలింగ్​కు ఒక్కరోజే గడువు ఉండడంతో బుధవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ప్రలోభాలు మొదలయ్యాయి.  పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు రూ.500 నుంచి వెయ్యి చొప్పున నగదు పంచడంతో పాటు మద్యం సీసాలు, కూల్​డ్రింక్స్, స్వీట్​బాక్సులు, గిఫ్టులు పంపిణీ చేశారు. ఫిర్యాదులు రావడంతో పలుచోట్ల పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయి. కొన్నిచోట్ల నామమాత్రంగా తనిఖీలు చేయడంపై ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లాలో కాంగ్రెస్​ లీడర్లను లక్ష్యంగా చేసుకొని సోదాలు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కొంతమంది పోలీసులు, ఐటీ ఆఫీసర్లు అధికారపార్టీకి తొత్తులుగా మారి ఇబ్బందిపెడ్తున్నారని వాపోయారు.

నూనె కార్టన్ లో నోట్ల కట్టలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో  ప్యాసిం జర్ ఆటోలో తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్ చేశారు. సిర్పూర్ (టి)కి చెందిన షఫీ ఉల్ హక్ ఆటోలో రోజూ కాగజ్ నగర్ నుంచి   కిరాణ సామాన్లు తీసుకు వస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం సామాన్లు తెస్తుండగా సిర్పూర్ కు చెందిన తంగడపల్లి సంతోష్, ముసావీర్  ఫ్రీడమ్ నూనె కార్టన్ ను  షఫీకి ఇచ్చి..   సిర్పూర్ లో తీసుకుంటామని చెప్పారు. చార్జి కింద రూ.50 ఇచ్చారు. సిర్పూర్ పీఎస్​ వద్ద  పోలీసులు   ఆటోను తనిఖీ చేయగా,  ఆయిల్ కార్టన్​లో  డబ్బు కట్టలు కనిపించాయి.  అందులో రూ. 56.48 లక్షలున్నట్టు గుర్తించారు. డ్రైవర్​ను   అదుపులోకి తీసుకుని ఎన్నికల అధికారులకు సమాచారమిచ్చారు. ఎస్ఎస్ టీమ్  వచ్చి వివరాలు తెలుసుకుంది. షఫీ ఉల్ హక్ ఇచ్చిన సమాచారం మేరకు తంగడపల్లి సంతోష్, ముసావీర్ ను విచారించగా..  రియల్ ఎస్టేట్ బిజినెస్​ కోసం  డబ్బు  తెస్తున్నట్టు చెప్పారు.  పట్టుకున్న మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పగించారు.   

కాంగ్రెస్ లీడర్లే లక్ష్యంగా సోదాలు

గద్వాల జిల్లాలో కాంగ్రెస్ లీడర్లే లక్ష్యంగా ఐటీ, పోలీ సుల సోదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో అర్ధరాత్రి ఐటీ దాడులు మరువక ముందే గద్వాలలోని కాంగ్రెస్ అభ్యర్థి సరిత అనుచరుడు ఇటిక్యాల వైస్ ఎంపీపీ దీన్నే శ్రీనాథ్ రెడ్డికి చెందిన ఇల్లు, కారులో పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ కాలనీలో ఉంటున్న ఆయన ఇంట్లోకి టౌన్ ఎస్ఐతో పాటు పోలీసులు ప్రవేశించారు. ఇంటితో పాటు కారులో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నగదు దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. కాంగ్రెస్​ లీడర్లే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారని, తమ ఫిర్యాదులపై మాత్రం స్పందించడం లేదని శ్రీనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్​లీడర్లు ఈ  దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో...

జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రామచందర్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తరపున ఓటర్లకు పంచేందుకు డబ్బులు తీసుకువచ్చారని సీ విజిల్ లో కంప్లయింట్​చేయగా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఏమీ దొరకలేదని చెప్పిన ఆఫీసర్లతో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నేత కావడంతో నామమాత్రపు తనిఖీలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాడర్ అక్కడికి చేరుకోవడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.

కరీంనగర్​ జిల్లా రుక్మాపూర్​లో..

చొప్పదండి మండలం రుక్మాపూర్​లో మహిళా సంఘం లీడర్ ఇంట్లో డబ్బులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మేడిపెల్లి సత్యం అనుచరుడు రంగన్న, రుక్మాపూర్ సర్పంచ్ లింగయ్య, మరో మహిళ దొరికారు. రూ.83,700 లను స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ ​స్క్వాడ్​ అధికారులు తెలిపారు.  

కెమెరాకు చిక్కిన్రు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓట్ల కోసం లీడర్లు కోట్లు గుమ్మరిస్తున్నారు.  ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా డబ్బులు  పంచుతున్నారు.  పాల్వంచలో  సొసైటీ డైరెక్టర్,  ఓ టెంపుల్​ ట్రస్టు బోర్డు మెంబర్, సీపీఐ కార్యకర్తలు  డబ్బులు పంచుతూ కెమెరాలకు చిక్కారు.  పాల్వంచ మండలం  నాగారంలోని ఓ వ్యక్తి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 7.70 లక్షలు   స్వాధీనం చేసుకున్నారు.

బీఆర్ఎస్ లీడర్ ఇంట్లో మద్యం, నగదు స్వాధీనం

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో  బీఆర్ఎస్ లీడర్, ఎంపీపీ స్రవంతి భర్త  టి.మోహన్ రావు ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. ఇంట్లో నిల్వ చేసిన 245 లిక్కర్​ బాటిల్స్ సీజ్​చేశారు. మోహ న్ రావును అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ పై రిలీజ్​ చేసినట్టు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.   మోహన్ రావు ఇంటి ఆవరణలోనే ఉండే వెల్ది ఆనందరావు  నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకొని పెద్దపల్లి ఆర్​డీఓకు అప్పగించినట్టు ఎఫ్ఎస్ టి అధికారి వరప్రసాద్ తెలిపారు.

రైస్​మిల్లర్​ ఇంట్లో రూ.31.50 లక్షలు

ఇదే జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని  రైస్ మిల్లర్​ ఆనందరావు ఇంట్లో మంగళవారం పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించి రూ.31.50 లక్షలు పట్టుకున్నారు. ఆనందరావు కాంగ్రెస్ మద్దతుదారుడని తెలిసింది. పట్టుబడిన డబ్బును  ఐటీ  అధికారులకు అప్పగించినట్లు సీఐ జగదీశ్​ చెప్పారు.