- ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 దాకా దరఖాస్తుల స్వీకరణ
- నవంబర్ 17న ఆన్‌లైన్‌లో ఎగ్జామ్
- ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. స్టాఫ్ నర్సుల భర్తీకి నవంబర్ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు తీసుకుంటారు. దరఖాస్తుదారులకు కనీసం 18 ఏండ్లు, గరిష్టంగా 46 ఏండ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024, జులై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 20 పాయింట్లు
పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. వివరాలకు తమ వెబ్‌సైట్ (https://mhsrb. telangana.gov.in)ను సందర్శించాలని ఆయన కోరారు.
బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం వాళ్లు అర్హులు
అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి.- ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ‘నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది.- అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
ప్రజా ఆరోగ్య విభాగం,
వైద్య విద్యా విభాగం 1,576
తెలంగాణ వైద్య విధాన పరిషత్ 332
ఆయుష్ 61
ఇన్స్టిట్యూట్ ఆఫ్
ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) 01
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ 80