
- మొదలుకానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ
- మధ్యాహ్నం రాబోయే హైకోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ
- వేచి చూసే ధోరణిలో అభ్యర్థులు
కరీంనగర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడునుంది. దీంతో వెంటనే తొలివిడతలో ఎన్నికలు జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకానుంది. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం రిటర్నింగ్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో.. కోర్టు ఇచ్చే ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. దీంతో అభ్యర్థులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కొందరు ఆశావాహులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.
కరీంనగర్ జిల్లాలో 6 జడ్పీటీసీలు, 7ఎంపీటీసీలు..
కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ డివిజన్ లోని 6 జడ్పీటీసీ స్థానాలతోపాటు ఈ ఆరు మండలాల్లోని 70 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే మండలాల్లో శంకరపట్నం(13), వీణవంక(14), ఇల్లందకుంట(9), జమ్మికుంట(10), హుజూరాబాద్(12), వి.సైదాపూర్(12) ఉన్నాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలివిడతలో 7 జడ్పీటీసీ స్థానాలతోపాటు 11 మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎన్నికలు జరిగే మండలాల్లో బోయినపల్లి(11 ఎంపీటీసీలు), చందుర్తి(10), రుద్రంగి(5), వేములవాడ అర్బన్(6), వేములవాడ రూరల్(7), కోనరావుపేట(12), ఇల్లంతకుంట(14) ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో 10 జడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎన్నికలు జరిగే మండలాల్లో బీర్పూర్(6 ఎంపీటీసీలు), రాయికల్(14), సారంగాపూర్(7), ఇబ్రహీంపట్నం(12), మల్లాపూర్(15), మెట్ పల్లి(14), భీమారం(6), కథలాపూర్(13), కోరుట్ల(12), మేడిపల్లి(9) ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో 7 జడ్పీటీసీ స్థానాలతోపాటు 7 మండలాలు అంతర్గాం, ధర్మారం, కమన్ పూర్, మంథని, పాలకుర్తి, రామగిరి, ముత్తారంలలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఎన్నికల ప్రచారం షురూ
రామడుగు, వెలుగు: పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ప్రచారం ప్రారంభించారు. రామడుగు మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి హరీశ్ బుధవారం వెంకట్రావుపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వెంకట్రావుపల్లె, కిష్టంపల్లెలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, గంగాధర ఏఎంసీ మాజీ చైర్మన్ లచ్చయ్య, లీడర్లు తిరుపతి, శంకర్, రమేశ్, రాజమల్లయ్య, బాబు పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు- తొలివిడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
ఉపసంహరణ అక్టోబర్ 15
ఎన్నికల తేదీ అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు నవంబర్ 11