
పెద్ద మొత్తాలకు సేఫ్ అండ్ సెక్యూర్ సిస్టమ్ 2004 నుంచి ఆర్‌టీజీఎస్ అందుబాటు
నవంబర్ నెలలోనే రూ.80 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్
అప్పటికీ ఇప్పటికీ మారిన పేమెంట్స్ విధానాలు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆర్‌టీజీఎస్ సర్వీసులు ఇవాల్టి నుంచి 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబర్ 14(సోమవారం) నుంచి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్) సేవలు కొత్త దశలోకి ఎంటర్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇవాళ రాత్రి 12.30 నుంచే ఈ సేవలు 24X7 అందుబాటులోకి వస్తాయని ముందస్తుగానే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు. డిజిటల్ పేమెంట్లను మరింత పెంచేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. హై వాల్యు ట్రాన్సాక్షన్స్‌కు ఆర్‌టీజీఎస్ సిస్టమ్‌ను వాడతారు. ఇన్ని రోజులు ఇది కస్టమర్లకు అన్ని వర్కింగ్ డేస్‌లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే పనిచేసేది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ఛార్జీలు లేవు. 2019 జూలై నుంచే ఈ ఛార్జీలను తీసేసింది. ఇక ఇప్పుడు ఎల్లవేళలా ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. దీంతో డిజిటల్ పేమెంట్స్‌కు మరింత జోష్ వస్తుందని బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి. రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్‌ను జరపాలంటే ఆర్‌టీజీఎస్ ఫెసిలిటీని వాడాల్సి ఉంటుంది. తక్కువ మొత్తాల కోసం ఇతర పేమెంట్స్ విధానాలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్), ఇమిడియేట్ పేమెంట్ సర్వీసు(ఐఎంపీఎస్), యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) వంటివి వాడుకోవచ్చు. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు పెద్ద మొత్తంలో ఫండ్స్ పంపించుకోవాలంటే సేఫ్ అండ్ సెక్యూర్ సిస్టమ్ మాత్రం ఆర్‌టీజీఎస్‌నే.
బ్యాంక్ పేమెంట్లలో ఎన్నో మార్పులు…
ఇండియాలో ఇప్పుడు ఉన్నన్ని పేమెంట్స్ సాధనాలు ఒకప్పుడు లేవు. ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఒక్క క్లిక్‌తో డబ్బులను పంపిస్తున్నాం. కానీ ఒకప్పుడు డబ్బులు పంపించాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిందే. డిపాజిట్ ఫామ్ తీసుకుని, మనం ఎవరికి వేయాలనుకుంటున్నాం, వాళ్ల అకౌంట్ వివరాలు రాసి డబ్బులు కడితే.. ఆ డబ్బుల్ని బ్యాంక్ అధికారులు వారికి వేసేవారు. ఇక పెద్ద మొత్తంలో ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు అయితే మరీ కష్టం అయ్యేవి. చెక్ తో పాటు ఒక రిప్రజెంటేటివ్‌ను పంపాల్సి ఉండేది. ఒకవేళ వారు వెళ్లే సమయానికి బ్యాంక్ క్లోజ్ అయితే.. పేమెంట్స్ జరిగేవి కావు. 2000 ప్రారంభం వరకు పేమెంట్ సిస్టమ్ పూర్తిగా పేపర్ బేస్డ్, చెక్‌లకు చెందినదే. హై వాల్యు పేమెంట్స్‌కు అయితే.. బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఆర్‌బీఐ క్లియరింగ్ సెల్‌కు వెళ్లి, కౌంటర్ పార్టీ బ్యాంక్ ట్రాన్సాక్షన్‌ను ధృవీకరించుకోవాల్సి వచ్చేది. అన్ని వెరిఫై చేసుకున్నాక చెక్ జారీ చేసేవారు. ఈ ప్రాసెస్ మొత్తానికి కొన్ని రోజుల వ్యవధి పట్టేదని ఎస్‌బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వీజే కన్నన్ అన్నారు. కానీ 2000 తర్వాత చాలా వరకు పరిస్థితులు మారాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ డేటా ఒక ప్రూఫ్‌గా మారింది. కోర్టు వివాదాల్లో కూడా వీటిని అంగీకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్(ఐడీఆర్‌బీటీ) చేపట్టిన స్టడీ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ ప్రయోజనాలను వివరించింది. ఇలా ఆర్‌టీజీఎస్‌కు పునాది పడింది.
ఆర్‌టీజీఎస్ జర్నీ…
మార్చి 2004లో ఆర్‌టీజీఎస్‌ను ఆర్‌బీఐ లాంచ్ చేసింది. ఈ పదహారేళ్లలో ఆర్‌టీజీఎస్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసింది. ఎక్కువ మంది ఈ సిస్టమ్‌ను వాడేందుకు దీన్ని మరింత సెక్యూర్‌గా, కాస్ట్ ఎఫెక్టివ్‌గా మార్చింది. 2010లో ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన ఛార్జీలను తగ్గించింది. గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్నప్పుడు ఆర్‌టీజీఎస్ ప్లాట్‌ఫామ్‌ను రెగ్యులేటరీ పూర్తిగా మార్చేసింది. గ్లోబల్ స్టాండర్డ్స్ ఐఎస్‌ఓ 20022కు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది. ఇక 2019లో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. బ్యాంక్‌లకు ఆర్‌టీజీఎస్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా ఫ్రీగా ఉంటుందని, ఈ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నిర్ణయం చిన్న వ్యాపారులు సైతం ఈ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు సహకరించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌టీజీఎస్ ద్వారా 15 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్‌ను మన బ్యాంకింగ్ సిస్టమ్ రికార్డు చేసింది. వీటి విలువ రూ.1,311 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది కేవలం నవంబర్ నెలలోనే రూ.80 లక్షల కోట్ల విలువైన 1.38 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆర్‌టీజీఎస్ ప్లాట్‌ఫామ్‌పై జరిగాయి. వీటిలో రూ.68 లక్షల కోట్లు కస్టమర్ అకౌంట్లకు జరగగా.. మిగిలినవి ఇంటర్‌బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్‌గా ఉన్నాయి.
చెక్ పేమెంట్లకు ‘పాజిటివ్ పే’
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి చెక్ పేమెంట్లకు కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆగస్ట్‌లోనే ఈ రూల్స్‌ను ఆర్‌బీఐ నిర్ణయించింది. చెక్ పేమెంట్ల కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ను ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ కొత్త రూల్ కింద రూ.50 వేలకు పైన ఏ పేమెంట్స్ జరిగినా కూడా కీలక వివరాల విషయంలో రీ–క్లారిఫికేషన్ తీసుకోవాల్సి వుంటుంది. చెక్ ద్వారా జరిగే మోసాలను నిరోధించేందుకు ఆర్‌బీ ఈ నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌గా ఉన్న బ్యాంక్‌లు ఫండ్ ట్రాన్స్‌ఫర్ల కోసం మెరుగైన సర్వీసులను ఆఫర్ చేస్తాయి. కానీ కస్టమర్లందరికీ ఆర్‌టీజీఎస్ విషయంలో ఒకే విధమైన సేవలు ఉండాలి. ఆర్‌టీజీఎస్‌ను ఎల్లవేళలా అందుబాటులోకి తేవడం ద్వారా ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఏ బ్యాంక్‌కు అయినా ఫండ్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంతో వ్యాపారాల సర్వీసులు పెరుగుతాయి. – ఆర్ గాంధీ, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్.
మార్చి 2004
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్
సిస్టమ్ లాంచ్.
నవంబర్ 2010
ఆర్‌టీజీఎస్ వాడకాన్ని పెంచేందుకు ఆర్‌టీజీఎస్ ఛార్జీలు తగ్గింపు
అక్టోబర్ 2013
గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఆర్‌టీజీఎస్‌లో మార్పులు
డిసెంబర్ 2019
ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్స్‌పై ఉన్న మొత్తం ఛార్జీలు తొలగింపు
డిసెంబర్ 2020
24X7 ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటు