అమరుల పోరాటాల వల్లే ఫ్రీగా బతుకుతున్నం

అమరుల పోరాటాల వల్లే  ఫ్రీగా బతుకుతున్నం
  • ఇప్పుడన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే
  • ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలె: తమిళిసై
  • ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసుకోవాలి: జస్టిస్​ జాస్తి చలమేశ్వర్
  • కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాలు నడవాలనడం సరికాదు: ఒవైసీ

హైదరాబాద్​, వెలుగు :   ఇప్పుడన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలే నడుస్తున్నాయని, సమాఖ్య స్పూర్తికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేయాలని గవర్నర్​ తమిళి సై అన్నారు. సమాఖ్య వ్యవస్థలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని  ఆమె సూచించారు. సౌత్​ ఫస్ట్​ ఆధ్వర్యంలో ‘భారత్ నిజంగా సమాఖ్య రాజ్యమా’ ?  అన్న అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో తమిళిసై మాట్లాడారు. గతంలో రాజకీయాల్లో ఐడియాలజీ, ఒపినీయన్లు వేరుగా ఉన్నప్పటికీ  పరస్పరం గౌరవించుకునే వారని గుర్తుచేశారు. ఆరోపణలు, విమర్శలు,  ప్రజల సమస్యలపై స్పందించే తీరు కూడా చాలా హుందాగా ఉండేదన్నారు. ఇప్పుడు అది కనుమరుగైందని ఆమె వాపోయారు. ప్రోగ్రామ్స్​, ప్రోగ్రెస్, వర్కింగ్​ స్టైల్​ వేరు అయినప్పటికీ,. దేశం కోసం కనే కలలు మాత్రం వేరుగా ఉండవని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫెడరలిజం గురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఫెడరిలిజం అనేది పొలిటికల్​ అరెంజ్​ మెంట్ అని జస్టిస్​ జాస్తి చలమేశ్వర్​​ అన్నారు. న్యాయవ్యవస్థ సమాఖ్య వ్యవస్థలో భాగమని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మాట్లాడుతూ అనేక విషయాల్లో కేంద్రం పెత్తనం సరికాదన్నారు. పన్నుల విషయంలో 42 శాతానికి పెంచినట్లు చెప్తున్నా 29 శాతం వస్తున్నదని రాష్ట్రాలు చెప్పడం ఆలోచించాల్సిన విషయమన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ మాట్లాడుతూ కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకుని అదే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఫెడరలిజం కాదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పరిస్థితులు ఉంటాయన్నారు. లాక్​ డౌన్​ విషయంలో కేంద్రం ఇష్టారీతిన ఆదేశాలు జారీ చేసిందన్నారు. టీమ్​గా పనిచేయాలనుకున్నప్పుడు అందరితో చర్చలు జరపాలని ఆయన సూచించారు.

అమెరికా మాదిరి  ఫెడరలిజం ఉండాలి : కేటీఆర్​

దేశంలో, రాష్ట్రంలో బలమైన విపక్షం ఉండాలని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. అమెరికా మాదిరి ఫెడరలిజం దేశంలో ఉండాలని సూచించారు. ఇక్కడ సౌత్​ స్టేట్స్​ 35 శాతం జీడీపీకి కాంట్రిబ్యూట్​ చేస్తున్నాయని,  అయితే కేంద్రం దగ్గరకు వెళ్లినప్పడు మాత్రం ఫ్లీజ్​ అని అడుక్కోవాల్సి వస్తోందన్నారు. ‘‘కేంద్రం నుంచి వచ్చే పెద్దలు కూడా వాళ్లేదో మాకు ఇస్తున్నట్లు మాట్లాడుతున్నరు. కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తున్నందున రాష్ట్రానికి  కేంద్ర మంత్రులు థ్యాంక్స్​ చెప్పిపోవాలి. మేం ఇస్తున్నం మీరు తీసుకునే వాళ్లు  అనే ధోరణి చూపెట్టడం సరైంది కాదు.  పెత్తనం చెలాయించాలన్న ధోరణే ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. జీడీపీ అంటే గుజరాత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్​లా మారింది.  ఇది ఫెడరలిజం కాదు” అని కేటీఆర్ పేర్కొన్నారు. 

అమరుల పోరాటాల వల్లే  ఫ్రీగా బతుకుతున్నం
విమోచన వేడుకల్లో గవర్నర్  

హైదరాబాద్, వెలుగు: అమరవీరుల త్యాగాలు, పోరాటాల వల్లే మనమంతా విమోచన దినం జరుపుకుంటున్నామని గవర్నర్ తమిళిసై అన్నారు.  రజాకార్ల పాలనలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె గుర్తుచేశారు. శనివారం రాజ్ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర సమర యోధులను గవర్నర్  సన్మానించారు. అనంతరం గవర్నర్  మాట్లాడుతూ అమరవీరుల చరిత్ర మరుగున పడిందని, వారి త్యాగాలను అందరూ స్మరించుకోవాలని సూచించారు. విమోచన దినోత్సవం సందర్భంగా  ‘హైదరాబాద్ విమోచన ఉద్యమం, త్యాగాలు, ఇబ్బందులు’  అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో  విజేతలకు గవర్నర్  బహుమతులు అందజేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా 25 మంది  టీబీ పేషెంట్లకు తమిళిసై నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో  ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా న్యూట్రీషన్ ఫుడ్ కిట్ లను కూడా అందజేశారు. 2025 కల్లా మన దేశాన్ని టీబీ ముక్త్ భారత్ గా తీర్చిదిద్దాలన్నదే ప్రధాని లక్ష్యమని గవర్నర్  తెలిపారు.