ఇకపై సినిమాలను వీడను: చిరంజీవి

 ఇకపై సినిమాలను వీడను: చిరంజీవి

హైదరాబాద్, వెలుగు: యువ హీరోలు తనకు పోటీ కాదని, తానే వాళ్లకు పోటీ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సోమవారం హాజరైన చిరు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌‌ ద ఇయర్‌‌‌‌ 2002’ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన ఇఫీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి చిరంజీవీ థ్యాంక్స్ చెప్పారు. కొన్ని అవార్డులు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయని, వాటిలో ఇఫీ కూడా ఒకటన్నారు. సరైన టైంలో తనకు ఈ అవార్డు వచ్చిందని చెప్పిన మెగాస్టార్.. ఇది తనతో పాటు తన అభిమానుల్లో జోష్‌‌ నింపిందన్నారు.

‘మిడిల్ క్లాస్‌‌ ఫ్యామిలీలో పుట్టిన శివ శంకర వరప్రసాద్ అనే నాకు ఈ సినిమా ఇండస్ట్రీ ‘చిరంజీవి’గా మరో జన్మనిచ్చింది. నలబై ఐదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల కొన్నేళ్లు గ్యాప్ వచ్చింది. నా అభిమానులకు ఓ మాటిస్తున్నా.. ఇకపై జీవితంలో ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టను. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు నేను దాసుడిని.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని అన్నారు.